Low Blood Pressure: రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు.. కొద్దిపాటి వికారం, కళ్ళు తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు.. ఇది స్పృహ కోల్పోవడానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. డాక్టర్ దగ్గరికి వెళ్లే లోపు ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రక్తపోటును కొంతవరకు పెంచువచ్చు. అయితే.. ఇది శాశ్వత పరిష్కారం కాదని కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చర్యలు:
నీరు తాగడం: డీహైడ్రేషన్ కూడా లోబీపీకి ప్రధాన కారణం. బీపీ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఒక గ్లాసు నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ పరిమాణం పెరుగుతుంది. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ తాగడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే సోడియం రక్తపోటును పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా లోబీపీ సమస్య నుంచి తక్కువ సమయంలోనే ఉపశమనం అందిస్తుంది.
ఉప్పు తీసుకోవడం: సాధారణంగా రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి ఉప్పు తగ్గించమని చెబుతారు. కానీ తక్కువ రక్తపోటు ఉన్నవారికి.. కొద్దిగా ఉప్పు తీసుకోవడం తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి తాగడం లేదా ఉప్పు వేసిన స్నాక్స్ తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిమితంగా ఉప్పు కలిపిన నీరు తీసుకోవాలి.
కాఫీ లేదా కెఫిన్ డ్రింక్స్: కాఫీలోని కెఫిన్ తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడం రక్తపోటును తక్షణమే పెంచడానికి సహాయ పడుతుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపించి రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. కానీ. దీని ప్రభావం కొద్ది సేపు మాత్రమే ఉంటుంది.
కాళ్ళు పైకెత్తి పడుకోవడం: రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు.. పడుకుని కాళ్ళను గుండె స్థాయి కంటే పైకి ఎత్తడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మైకం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయ పడుతుంది. ఇది షాక్‌లో ఉన్నవారికి కూడా ఒక ప్రాథమిక చికిత్స.
Also Read: గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !
చిన్నపాటి భోజనం: కొన్నిసార్లు.. భోజనం తర్వాత రక్తపోటు పడిపోవచ్చు (పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్). ఇలాంటి సందర్భాల్లో.. ఒక్క సారిగా భోజనం తీసుకోకుండా.. రోజులో కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం మంచిది. అంతే కాకుండా ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలకు బదులుగా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే వాటిని తినండి.
ఓఆర్‌ఎస్ (ORS) : డీహైడ్రేషన్ వల్ల రక్త పోటు తగ్గితే.. ఓఆర్‌ఎస్ తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను అందించి.. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
ఈ చిట్కాలు కేవలం అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే పాటించాలి. మీకు తరచుగా లో బీపీ సమస్యలు ఉంటే లేదా పైన పేర్కొన్న చర్యలు తీసుకున్నా లక్షణాలు తగ్గకపోతే.. ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి.