Lemon Grass Tea: లెమన్‌గ్రాస్ (నిమ్మ గడ్డి) అనేది ఆహారంలో, ఆయుర్వేద వైద్యంలో, సుగంధ తైలాల తయారీలో విస్తృతంగా ఉపయోగించే ఒక మొక్క. దీనికి నిమ్మ వంటి సువాసన ఉంటుంది. కానీ రుచిలో పుల్లగా ఉండదు. లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని వేడిగా లేదా చల్లని డ్రింక్ లాగా కూడా తాగొచ్చు. లెమరర్ గ్రాస్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్‌గ్రాస్ టీ యొక్క ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు:
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
లెమన్‌గ్రాస్ టీ జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది. భోజనం తర్వాత ఒక కప్పు లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
2. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది:
ఇది ఒక సహజమైన మూత్రవర్ధకం. అంటే ఇది మూత్ర విసర్జనను పెంచుతుంది. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది కిడ్నీ, కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.
3. రక్తపోటును నియంత్రిస్తుంది:
లెమన్‌గ్రాస్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ టీ తాగితే మంచిది. అయితే.. లోబీపీ ఉన్నవారు డాక్టర్ సంప్రదించి తాగడం ఉత్తమం.
4. ఒత్తిడిని తగ్గిస్తుంది:
లెమన్‌గ్రాస్ టీ ఒక సుగంధభరితమైన డ్రింక్. దానిలోని సువాసన మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఇది ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఈ టీ తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఈ టీలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటి చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
Also Read: ఉదయం టిఫిన్ చేయడం మానేస్తే.. ఏమౌతుందో తెలుసా ?
6. బరువు తగ్గడానికి సహాయం:
లెమన్‌గ్రాస్ టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీవక్రియ (metabolism) రేటును పెంచుతుంది. అంతే కాకుండా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక మంచి డ్రింక్.
7. నొప్పి నివారిణిగా పని చేస్తుంది:
లెమన్‌గ్రాస్‌లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా.. ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది.
ఎలా తయారు చేయాలి ?
ఒక గ్లాసు వేడి నీటిలో కొన్ని లెమన్‌గ్రాస్ ఆకులను లేదా ముక్కలను వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత వడకట్టి, అవసరమైతే కొద్దిగా తేనె కలిపి కూడా తాగొచ్చు.