Diabetes In India: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇండియా మధుమేహానికి రాజధానిగా మారుతోంది. ఈ వ్యాధి గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పెద్దవారితో పాటు యువతలో కూడా దీని ప్రభావం పెరుగుతోంది. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. డయాబెటిస్ రావడానికి గల కారణాలు, నివారణ మార్గాలను గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన కారణాలు:
లైఫ్ స్టైల్ మార్పులు:
గత కొన్ని దశాబ్దాలుగా మన లైఫ్ స్టైల్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గిపోయింది. ప్రజలు గంటల తరబడి కూర్చుని పనిచేయడం, కారు లేదా బైక్ లపై ప్రయాణించడం వంటివి పెరిగాయి. దీనివల్ల బరువు పెరిగి, మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువవుతోంది .
ఆహారపు అలవాట్లు:
ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం కూడా బాగా పెరిగింది. ఈ ఆహారాల్లో చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఊబకాయానికి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి మధుమేహానికి కారణమవుతున్నాయి. మన సంప్రదాయ ఆహారంలో ఉన్న పీచు పదార్థాలు, పోషకాలు ఇప్పుడు తినే ఆహారంలో తగ్గిపోయాయి.
ఊబకాయం:
మధుమేహం రావడానికి ఊబకాయం ఒక ముఖ్య కారణం. శరీరంలో కొవ్వు శాతం పెరిగినప్పుడు ఇన్సులిన్ సరిగా పనిచేయదు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. పట్టణాల్లో అధిక కేలరీలు ఉన్న ఆహారం తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకకాయం సమస్య పెరుగుతోంది.
జన్యుపరమైన కారణాలు:
భారతీయులలో మధుమేహం వచ్చే అవకాశం జన్యుపరంగా కూడా ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరంలో తక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అలాగే.. తక్కువ బరువు ఉన్నవారిలో కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే.. పిల్లలకు కూడా అది వచ్చే అవకాశం ఎక్కువ.
Also Read: వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి !
ఒత్తిడి:
లైఫ్ స్టైల్‌లో ఒత్తిడి ఒక అంతర్భాగంగా మారింది. ఒత్తిడి వల్ల కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా మధుమేహం రావడానికి ఒక కారణం.
ఆరోగ్య సంరక్షణపై అవగాహన లేకపోవడం:
చాలామందికి మధుమేహం గురించి, దాని నివారణ గురించి అవగాహన లేదు. సాధారణ పరీక్షలు చేయించు కోకపోవడం వల్ల వ్యాధి మొదట్లో గుర్తించడం సాధ్యం కాదు. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కోసం వెళ్లడం వల్ల సమస్య ఇది తీవ్రమవుతుంది.
మధుమేహాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అలాగే.. కుటుంబంలో డయాబెటిస్ ఉంటే.. తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.