Happy 4K Kerala: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన్ను అభిమానులు ప్రేమగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ.. ఆయన కెరీర్ ఆరంభంలో వచ్చిన ‘హ్యాపీ’ (Happy) చిత్రం రీ-రిలీజ్‌లోనూ అక్కడ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జూన్ 12న విడుదలైన ఈ చిత్రం 11 రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్ రన్‌తో దూసుకుపోతోంది.
సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు మొదటి రెండు, మూడు రోజులు మాత్రమే థియేటర్లలో సందడి కనిపిస్తుంది. కానీ, ‘హ్యాపీ 4K’ వెర్షన్‌కు కేరళలో ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. 11 రోజులు పూర్తయినప్పటికీ, ఈ చిత్రం ఇప్పటికీ ప్రతిరోజూ దాదాపు రూ. 2 లక్షల రేంజ్‌లో గ్రాస్ వసూలు చేస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, కేరళలో 11 రోజుల రన్ ముగిసేసరికి ఈ సినిమా మొత్తం రూ. 1.48 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ఇవాళ్టి కలెక్షన్స్‌తో ఈ చిత్రం రూ. 1.50 కోట్ల మైలురాయిని చాలా సులభంగా అధిగమించనుంది. రీ-రిలీజ్ అయిన ఒక డబ్బింగ్ సినిమా, రెండో వారంలోనూ ఈ స్థాయి వసూళ్లను సాధించడం కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయంగా చెబుతున్నారు.
యంగ్ జనరేషన్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు తరలివస్తుండటంతో ‘హ్యాపీ 4K’ అనేక రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం కేరళ వ్యాప్తంగా సుమారు రూ. 27 లక్షల నుండి రూ. 30 లక్షల గ్రాస్ వసూలు చేసి, ఈ ఏడాది కేరళలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. కేవలం 6 రోజుల్లోనే రూ. 1.25 కోట్ల మార్కును అందుకుని సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
2006లో ఎ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యూర్ లవ్ స్టోరీ.. అప్పట్లోనే కేరళలో 175 రోజులకు పైగా ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత, సరికొత్త 4K విజువల్స్, యువన్ శంకర్ రాజా ఎగ్‌జైటింగ్ మ్యూజిక్, థియేటర్లలోని నైట్ షోస్ హౌస్‌ఫుల్ కావడం అల్లు అర్జున్ వన్-మ్యాన్ షోకు అద్దం పడుతోంది. ‘పుష్ప 2’ సినిమా కోసం కేరళ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో, ‘హ్యాపీ 4K’ సాధిస్తున్న ఈ సక్సెస్ అక్కడ బన్నీ మార్కెట్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది.