BJP MLA Basangouda Patil Suspend | కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆయనను ఆరేళ్లపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.
బసనగౌడ పాటిల్ యత్నాళ్.. ఇటీవలే కన్నడ నటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున అప్పటి నుంచి మీడియా దృష్టిలో నిలిచిపోయారు. ఇటీవలే, బెంగళూరులో బంగారం అక్రమ రవాణా కేసులో (Gold Smuggling Case) అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యా రావుపై సదరు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో, బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రన్యారావు తన శరీరంలోని అన్ని భాగాలలో బంగారు దాచుకొని అక్రమంగా రవాణా చేస్తోందని.. ఈ కేసు గురించి తన వద్ద కొంత సమాచారం ఉందని అదంతా అసెంబ్లీలో వెల్లడిస్తానని ఆయన ఇటీవలే మీడియాకు తెలిపారు.
కొన్ని వారాల క్రితం కూడా.. ఆయన మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్పపై కూడా విమర్శలు చేశాడు. యడ్యురప్ప తన కుమారుడు బి.వై విజయేంద్రపై కాకుండా పార్టీపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే బసనగౌడ సూచించాడు. అంతేకాక, బి.వై.విజయేంద్ర కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపించాడు.
Also Read: వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కాదు.. హై కోర్టు అలా వ్యాఖ్యానించడం బాధాకరం
2023 డిసెంబర్‌లో 32 జిల్లాలకు చెందిన అధ్యక్షులు.. యత్నాళ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ రోజు బీజేపీ నేతృత్వం ఆయనపై చర్యలు తీసుకుంటూ.. పార్టీ నుంచి బసనగౌడ పాటిల్ యత్నాళ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పార్టీ నుంచి తనను బహిష్కరించిన విషయంపై బసనగౌడ స్పందించారు. వారసత్వ రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా, సంస్కరణలు తీసుకురావాలని, ఉత్తర కర్ణాటక అభివృద్ధి కోసం తన పోరాటం కొనసాగించాలని కోరినందుకు, వ్యక్తుల ఆధిపత్యాన్ని తొలగించాలని అడిగినందుకు తనను ఆరేళ్లపాటు బహిష్కరించారని ఆయన ఆరోపించారు. ముక్కుసూటిగా మాట్లాడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా, హిందుత్వ కోసం తన పోరాటం కొనసాగుతుందని, ప్రజాసేవ చేయడానికి తాను దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తానని తెలిపారు.
ఇక, బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావు (Ranya Rao) కోర్టులో నిరాశకు గురైంది. ఆమె బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో పెట్టినట్లు న్యాయస్థానం ప్రకటించింది. 27వ తేదీన తీర్పును ప్రకటించనున్నట్లు తెలిపింది. రన్యా రావు విచారణకు సహకరించడం లేదని DRI తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆమె హవాలా డబ్బుతో బంగారం కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో రన్యా రావు నేరాన్ని అంగీకరించినట్లు DRI కోర్టుకు తెలిపింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో మార్చి 3వ తేదీన DRI అధికారులు ఆమెను అరెస్టు చేశారు. మరోవైపు, రన్యా రావు సవతి తండ్రి డీజీపీ రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. రామచంద్రరావు ఈ వ్యవహారం తనకు తెలియదని ప్రకటించినప్పటికీ, DRI అధికారులు ఆయనకు తెలిసినవిగా ఆ విషయాన్ని చెబుతున్నారు. సీబీఐ, ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
DRI ప్రక్రియ చట్టప్రకారం జరుగుతోందని, సమన్లు జారీ చేసిన తర్వాత, దుబాయ్‌లో బంగారం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు హవాలా ద్వారా పంపడాన్ని నిందితురాలు అంగీకరించిందని DRI న్యాయవాది మధు రావు తెలిపారు. “ఇది పోలీసుల విచారణ కాదు, జ్యుడీషియల్ విచారణ” అని ఆయన వివరించారు.