Amritsar Blast| భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత సైన్యం పాక్ భూభాగం వైమానిక దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ కూడా తిరిగి కాల్పులు జరిపే అవకాశాలున్నాయి. ఈ కారణంగా సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని అమృత్‌సర్ నగరంలో బుధవారం రాత్రి మూడు సార్లు పేలుళ్లు సంభవించినట్లు తెలిసింది. రాత్రి 10.30 నుంచి 11.00 వరకు నగరంలో సైనిక డ్రిల్ జరిగింది. ఈ క్రమంలోనే బ్లాకవుట్ రిహర్సల్ కూడా జరిగింది. అయితే తిరిగి రాత్రి 1.15 నుంచి 1.20 గంటల సమయంలో అమృత్ సర్ నగరంలో మూడు నాలుగు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
ఈ శబ్దాలు భారీగా ఉండడంతో సుదూర ప్రాంతాల వరకు దీని శబ్దం వినిపించింది. అయితే ఇప్పటివరకు ఆ శబ్దాలకు కారణమేంటో ఇంతవరకూ అధికారికంగా సమాచారం లేదు. మీడియా కథనాల ప్రకారం.. ఈ శబ్దాలు యుద్ధ విమానాల సూపర్ సోనిక్ స్పీడ్ కారణంగా వచ్చాయని ప్రచారం జరుగుతోంది. సూపర్ సోనిక జెట్ విమానాలు గాల్లో ఎగురుతున్నప్పుడు పేలుళ్ల లాంటి శబ్దాలు వినిపిస్తాయి. అయితే ఈ పేలుళ్ల శబ్దాలు విని స్థానికులు భయపడిపోయారు.
Also Read: యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రజలు ఇండియాను వ్యతిరేకించరు.. పాక్ ముస్లిం పెద్ద వ్యాఖ్యలు
భారత్, పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఈ పేలుళ్ల శబ్దాల వార్త విని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోలన చెందుతున్నారు. ఈ పేలుళ్ల శబ్దాలు నిజంగానే అందరికీ వినిపించాయని అమృత్ సర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ భుల్లర్ స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. “నేను కూడా ఆ పేలుళ్ల శబ్దాలు విన్నాను. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అంచనాతో వెళ్లి అక్కడ చూశాం. కానీ ఏమీ తెలియలేదు. ఇప్పుడు భద్రతా పరంగా అమృత్ సర్ నగరంలో కొన్ని గంటలపాటు బ్లాకవుట్ (కరెంటు కోత) చేశాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అదుపులో ఉన్నాయి.” అని ఆయన అన్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ పేలుళ్ల శబ్దాల మూలం కోసం గాలిస్తున్నారు. ప్రజలు బాంబు పేలుళ్ల గురించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసులు కోరారు. అధికారులు, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని కమిషన్ గుర్‌ప్రీత్ చెప్పారు.
అమృత్ సర్ లో బ్లాకవుట్
అమృత్ సర్ జిల్లా కలెక్టర్ ఈ పేలుల్ల శబ్దాల కారణంగా ప్రమాదాలు జరుగకుండా నగరమంతా కరెంటు కోత విధించారు. ఏదైనా అనుమాస్పదంగా ఉంటే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని అనవసరంగా బయటికి రాకూడదని ఆయన అన్నారు. నగరంలో కరెంటు కోతలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా వచ్చిన నిర్దేశాల ప్రకారం చేశామని పోలీసులు తెలిపారు.