Congress Modi-Adani ek hain | కొన్న రోజుల క్రితం అమెరికా న్యాయ శాఖ అదానీ కంపెనీలపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. అక్కడి కోర్టులో బిలియనీర్ వ్యాపారవేత్త గౌతం అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీ సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ సిఈఓ ఇతర ప్రముఖుల పేర్లు నిందితులుగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ అంశంపై దేశంలోని కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా గౌతమ్ అదానీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాపాడుతున్నారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంటులో గురువారం డిసెంబర్ 5, 2024న కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ మోడీ, అదానీకి వ్యతిరేకంగా వినూత్న నిరసన చేపట్టారు.
గౌతమ్ అదానీ కంపెనీలలో జరుగుతున్న అవినీతిపై పార్లమెంటు సంయుక్త కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ.. పార్లెమెంటు భవనంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన చేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలీ మోడీ, అదానీలకు వ్యతిరేకంగా జాకెట్లు ధరించారు. ఆ జాకెట్లపై మోడీ, అదానీ ఒక్కటే. అని రాసి ఉంది.
Also Read: దేశంలో బడా వ్యాపారులే లాభపడుతున్నారు.. పేదలు కాదు.. కేంద్రంపై రాహుల్ ఫైర్
అదానీ, మోదీ ఒక్కటే వారిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. “అదానీ గారిని విచారణ చేయకుండా మోడీ గారు అడ్డుపడతారు. ఎందుకంటే విచారణకు ఆదేశిస్తే.. ఆయనే స్వయంగా చిక్కుకుంటారు. ఆయనపై కూడా విచారణ జరుగుతుంది. మోదీ, అదానీ ఒక్కటే.. ఇద్దరూ కాదు ఒక్కరే.” అని పార్లెమెంటు కాంపెక్స్ భవనంలో రాహుల్ గాంధీ నినాదాలు చేశారు. ఆయనతో పాటు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా స్వరం కలిపారు.
బుధవారం కూడా పార్లమెంటు ఆవరణలో అదానిపై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంట్ కమిటీ చేత విచారణ చేయించాలిన ఇండియా కూటమి పార్టీలు నిరసనలు చేశాయి. పార్లమెంటు ఆవరణలోని మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్, డిఎంకె, ఉద్ధవ్ శివసేన, ఆర్‌జెడి, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీల ఎంపీలు నిరసన చేశారు. విచారణ చేయించాలిన డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనలేదు.
కానీ బుధవారం ఈ నిరసనకు రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ ప్రాంతంలో జరిగిన మసీదు హింసాత్మక ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే సంభల్ పోలీసులు ఆయనను మార్గంలోనే అడ్డుకున్నారు.
మరోవైపు లోక్ సభ సెక్రటేరియట్ ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు జారీ చేసింది. పార్లమెంటు గేటు వద్ద నిలబడి నిరసన చేయవద్దని.. అలా చేస్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నోటీసులో పేర్కొంది.