Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద ఎస్ఎల్ఎర్, ఇన్సాస్ ఆయుధాలతో పాలు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా అక్కడ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాల్పులు జరిగిన సంఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. బీజాపూర్, గంగలూరు అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అక్కడ భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో 225 మంది మావోయిస్టులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇందులో 208 మంది బీజాపూర్, బస్తర్, కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల్లోని బస్తర్ డివిజన్‌లో ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. 2026 మార్చ్ నాటికి మావోయిస్టులను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం జార్ఖండ రాష్ట్ర గామ్లా జిల్లాలోని ఘాగ్రా అటవీ ప్రాంతంలో కూడా ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడగా లొంగిపొమ్మని చెప్పినా వారు వినకుండా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ప్రాణ రక్షణ కోసం తాము ఎదురుకాల్పులకు సిద్ధపడినట్టు వారు చెప్పారు. తమవైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు అధికారులు వివరించారు.
ALSO READ: Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. భర్త స్పెర్మ్ కాకుండా మరొకరి శుక్రకణాలతో..?
ALSO READ: Akshara Devalla: చిన్న వయస్సులోనే అద్భుత ఘనత సాధించిన అక్షర దేవళ్ల