Akshara Devalla: కూచిపూడి నాట్య సంప్రదాయంలో అత్యంత శోభాయమానమైన భామా కలాపాన్ని 14 ఏళ్ల అక్షర దేవళ్ల అద్భుతంగా ప్రదర్శించి, ఐదు అంతర్జాతీయ, జాతీయ స్థాయి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. భామా ప్రవేశం పేరుతో తన కూచిపూడి రంగ ప్రవేశాన్ని రవీంద్రభారతి వేదికపై అక్షర దేవళ్ల రసరమ్యంగా చేసింది. కూచిపూడి పితామహుడు సిద్ధేంధ్రయోగి రచించిన భామా కలాపం, సాధారణంగా సీనియర్ కళాకారులు గంట సమయానికే కుదించి ప్రదర్శించే నాట్యనాటకం. అలాంటి సమయంలో, సంప్రదాయ పరంగా దీనిని పూర్తి రూపంలో రెండు గంటల 30 నిమిషాలపాటు ప్రదర్శించిన అక్షర తన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
భామాకలాపం సంగీతం, అభినయం, సంభాషణ, గానం, ఆహార్యం , హావభావ సమ్మేళిత సంపూర్ణ నృత్యనాటకం. నిజంగా సత్యభామే వచ్చిందా అన్నట్లుగా శృంగార, వీర, విరహ రసాలతో కూడిన సత్యభామ పాత్రలో పరకాయప్రవేశం చేసింది అక్షర.
సత్యభామలా గర్వాన్ని నఖశిఖపర్యంతం చూపిస్తూనే శ్రీకృష్ణుడు తనకు దూరమయ్యాడన్న విరహవేదనను అంతే లాఘవంగా చూపించి అందరి ప్రశంసలు అందుకుంది.
అక్షర దేవళ్ల చేసిన ఈ అసాధారణ నాట్యప్రదర్శనను గానూ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ గుర్తించాయి. రికార్డు సర్టిఫికెట్లను కరతాళ ధ్వనుల మధ్య ఆ సంస్థల ప్రతినిధులు హాజరై స్వయంగా అక్షరకు అందజేశారు. తన మూడో ఏటనే కూచిపూడి నృత్యాన్ని తన తల్లి కూచిపూడి గురు భావన పెదప్రోలు దగ్గర నేర్చుకోవడం ప్రారంభించిన అక్షర , జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది.
ఇటీవలే అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న అక్షర, అక్కడా తన నృత్యంతో మైమరిపించింది. బాలనటిగానూ రాణిస్తున్న అక్షర టాలీవుడ్ లో దాదాపు 15 సినిమాల్లో నటించింది. ఆమె కీలక పాత్ర పోషించిన తమ్ముడు సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ చిన్నారి నాట్యానికి ముగ్దులైన శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామీజీ తన ఆశ్రమానికి సాంస్కృతిక రాయబారిగా అక్షరను నియమించారు. ఇప్పుడు భామాకలాపం రికార్డు ప్రదర్శనతో కూచిపూడి ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అక్షర సంపాదించుకుందంటూ రంగప్రవేశం కార్యక్రమానికి హాజరైన కూచిపూడి గురువులు ఆశీర్వదించారు.
ALSO READ: Gaya News: దారుణం.. అంబులెన్సులో అమ్మాయిపై అఘాయిత్యం.. నరకం చూపించిన ఆ నలుగురు
ALSO READ: Samantha: దేవుడు సృష్టించిన అందమైన కళవి నువ్వు.. సమంత రెట్రో లుక్ కి నెటిజన్స్ ఫిదా