Pakistan Ranger In India| భారత సరిహద్దులోకి చొరబడిన పాకిస్తాన్ సైనికుడిని.. బీఎస్‌ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో ఓ పాకిస్తాన్ రేంజర్ అనధికారికంగా ప్రవేశించాడు. అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో బీఎస్‌ఎఫ్ జవాన్లు వెంటనే అతడిని పట్టుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ సమయంలో పాక్ రేంజర్ భారత భూభాగంలోకి చొరబడటం అనేక అనుమానాలకు కారణమైంది.
ఇటీవల ఓ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సంఘటన తెలిసిందే. అతడిని పాకిస్తాన్ ఆర్మీ నిర్బంధించింది. అతడిని విడుదల చేయాలని భారత సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి సానుకూల ఫలితం కనిపించలేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అతడిని విడుదల చేయడం సాధ్యం కాదని పాకిస్తాన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పాక్ రేంజర్‌ను అదుపులోకి తీసుకున్న భారత్ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
పాక్ యువతితో రహస్య వివాహం
పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని రహస్యంగా దాచడమే కాకుండా, ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ భారత్‌లోనే ఉంచిన ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను అతడి ఉద్యోగం నుంచి తొలగించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జాతీయులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె వివరాలను పరిశీలించగా, ఈ వ్యవహారం బయటపడింది.
Also Read: ఇండియా పాక్ ఉద్రిక్తత .. వివాహాలు రద్దు.. కుటుంబాలు విలవిల
గత ఏడాది మే నెలలో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతిని సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్‌కు చెందిన మునీర్ అహ్మద్ అనే ఆర్మీ జవాన్.. వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె వీసాపై భారత్‌కు వచ్చింది. అయితే, ఈ వివాహ విషయాన్ని మునీర్ తన ఉన్నతాధికారులకు తెలపకుండా దాచిపెట్టాడు. అంతేకాదు, ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ ఆమె భారత్‌లోనే ఉండిపోయింది. పహల్గాం ఉగ్రఘటన తర్వాత పాకిస్తాన్ జాతీయులు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీ కాగా, ఈ సందర్భంలోనే ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది.
దీంతో సీఆర్పీఎఫ్ అధికారులు మునీర్ అహ్మద్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. “పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న యువతితో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా, ఆమె వీసా గడువు ముగిసినా ఆశ్రయం కల్పించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించాడు. జాతీయ భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకు అతడిని తక్షణమే సర్వీసు నుంచి తొలగిస్తున్నాం” అని సీఆర్పీఎఫ్ ప్రతినిధి స్పష్టం చేశారు.