OTT Movies: ఒకప్పుడు మాధవన్‌కు రొమాంటిక్ హీరోగా మంచి పేరు ఉండేది. ఆ తర్వాత భిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో నుంచి విలన్ వరకు ఏ పాత్రలోనైనా సరే పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అయితే, చాలా రోజుల తర్వాత మాధవన్.. ఒక రొమాంటిక్ మూవీ చేశాడు. అదే ‘ఆప్ జైసా కోయి’. ఇందులో 42 ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లికాని వ్యక్తి పాత్రలో మెరిశాడు. మరి ఆ మూవీ స్టోరీ ఏమిటో చూసేద్దామా.
జంషెడ్‌పూర్ నగరంలో నివసించే శ్రీరేణు త్రిపాఠి (ఆర్. మాధవన్)కు 42 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. అతడు ఓ స్కూల్‌లో సంస్కృత ఉపాధ్యాయుడిగా పని చేస్తుంటాడు. శ్రీరేణు సాంప్రదాయ కుటుంబానికి చెందినవాడు. బాల్యంలో ఓ అమ్మాయి శాపం వల్లే తనకు ఇన్నేళ్లయినా పెళ్లి కావడం లేదని మదన పడుతూ జీవిస్తుంటాడు. ఉదయం సంస్కృత శ్లోకాలతో రోజును ప్రారంభిస్తాడు. కాలేజ్ తర్వాత తన ఇంట్లో పుస్తకాలతో సమయం గడుపుతుంటాడు. జీవితం మొత్తాన్ని అలాగే గడిపేస్తుంటాడు. పైగా అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు. అది కూడా అతడిని పెళ్లికి దూరం చేస్తుంది. దీంతో అతడి స్నేహితుడు దీపక్ శర్మ (నమిత్ దాస్) సలహాతో శ్రీరేణు ‘ఆప్ జైసా కోయి’ అనే డేటింగ్ యాప్‌లో చేరతాడు. ఈ యాప్‌లో ఏ అమ్మాయితోనైనా రొమాంటిక్‌గా మాట్లాడవచ్చు. ఫొటోలు కూడా అవసరం లేదు. దీంతో మాధవన్.. అమ్మాయిలపై ఉండే భయాన్ని తొలగించుకోవడం కోసం యాప్‌లో చేరతాడు.
ఆ అమ్మాయి గొంతుకు ఫిదా
శ్రీరేణుకు ఆ యాప్‌లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె చాలా రొమాంటిక్‌గా అతడితో మాట్లాడుతుంది. శ్రీ అని ముద్దుగా పిలుస్తుంది. ఆ పిలుపు శ్రీరేణుకు కూడా నచ్చుతుంది. అలా ఆ తెలియని అమ్మాయితో శ్రీరేణు డైలీ మాట్లాడతాడు. అదే సమయంలో శ్రీరేణు వదిన.. అతడికి కోల్‌కతా సంబంధాన్ని తీసుకొని వస్తుంది. ఆమె పేరు మధు బోస్ (ఫాతిమా సనా షేక్). ఆమె వయస్సు 32 ఏళ్లు. కోల్‌కతాలోని ఓ కాలేజ్‌లో ఫ్రెంచ్ ఉపాధ్యాయినిగా పనిచేస్తుంటుంది. ఆమె చాలా మోడ్రన్. వాస్తవానికి శ్రీరేణుకు అస్సలు మ్యాచ్ కాదు. కానీ, ఆమె ఆలోచనలు, స్వభావం, సాహిత్యం, సంగీతం, కళల పట్ల ఆసక్తి శ్రీరేణుకు నచ్చుతాయి. దీంతో ఆమెతో పెళ్లికి ఒకే చెప్పేస్తాడు.
ఎంగేజ్మెంట్‌లో అసలు నిజం తెలిసి..
మధు నచ్చడంతో వారి పెద్దలు ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేస్తారు. ఆ సమయంలో.. ఆ యాప్‌లో అమ్మాయి మాట్లాడినట్లుగా శ్రీరేణును శ్రీ అని ముద్దుగా పిలుస్తుంది. అచ్చం ఆమెలాగే.. అంతే.. శ్రీరేణుకు మైండ్ బ్లాక్ అవుతుంది. తనతో మాట్లాడినట్లే.. ఆమె ఎంతమందితో మాట్లాడి ఉండొచ్చని ఆలోచిస్తాడు. పైగా ఆమెకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెబుతుంది. అలాగే, తాను వర్జినా కాదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదు. ఇవన్నీ శ్రీరేణును ఆలోచనలో పడేస్తాయి. ఇక్కడ నుంచి కథ.. తెలుగులో గోపిచంద్, తాప్సీలు నటించిన ‘మొగుడు’ తరహా సాగుతుంది. కానీ, పూర్తిగా అలా ఉండదు. కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ముఖ్యంగా శ్రీరేణు వదిన ఎపిసోడ్‌ను కాస్త మెచ్యూర్డ్ మైండ్ ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకోగలరు. అదే మూవీ కథ మొత్తాన్ని తిప్పుతుంది. మరోవైపు మధు బాయ్ ఫ్రెండ్ రాహుల్ (అక్షయ్ ఒబెరాయ్) కూడా కథలోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ నుంచి కథ రకరకాలుగా తిరిగి క్లైమాక్స్‌కు చేరుతుంది. చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే.. ఈ మూవీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. చూసేయండి.
Also Read: Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ‘బాహుబలి’ కాపీనా?.. ఆ 20 నిమిషాలు సేమ్ టూ సేమ్