Water Board: నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓ అండ్ ఎమ్ సీజీఎం, జీఎంలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎండీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది..
జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జలమండలి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, కాబట్టి.. నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృథా చేయకూడని విజ్ఞప్తి చేశారు. అలాగే నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడితే మిగితా వినియోగదారులకు లో ప్రెషర్ తో నీటి సరఫరా కావడంతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్బంగా వెల్లడించారు.
ALSO READ: UOH Recruitment: గుడ్ న్యూస్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.2,18,200 శాలరీ..
అక్రమంగా మోటార్లు బిగించే వారిపై జరిమానాలు
వేసవిలో తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు సాధ్యమైన అన్ని మార్గాలపై జలమండలి ప్రత్యే దృష్టి సారించింది. ఇప్పటి వరకు తాగునీరు సరఫరాలో ఎలాంటి కొరత లేనప్పటికి కొందరు వినియోగదారుల తీరుతో లో ప్రెషర్ (తక్కువ ఒత్తిడి)తో నీటి సరఫరా సమస్య ఉత్పన్నం కావడాన్ని జలమండలి సీరియస్‌గా పరిగణించింది. నల్లాకు అక్రమంగా మోటర్లు బిగించే కనెక్షన్ దారులపై కొరడా ఝలింపించాలని నిర్ణయించింది. జరిమానాలు, మోటర్ సీజ్‌కు సిద్దమైంది. కొందరు నల్లా లకు మోటర్లు బిగిస్తుండటంతో 60 శాతం కనెక్షన్ దారులకు హైప్రెషర్‌తో సమృద్దిగా నల్లా నీరు సరఫరా, మోటరు లేని 40 శాతం వినియోగదారులల్లో 20 శాతం సాధారణంగా, మరో 20 శాతం లో–పెష్రర్‌తో కూడిన నీరు సరఫరా అవుతుండటంతో మెట్రో కస్టమర్ సెంటర్(ఎంసీసీ)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే నల్లా నీటి విడుదలలో సమయ పాలనా పాటిస్తున్నా.. లో ప్రెషర్ ఫిర్యాదుల తాకిడి ఎగబాగుతుండంతో ఇటీవల జలమండలి వాస్తవ పరిస్ధితిపై థర్డ్ పార్టీ ద్వారా ఆరా తీసింది.నీటి సరఫరా సమయంలో నల్లాలకు మోటర్లు బిగిస్తున్నట్లు గుర్తించింది. నీటి పెష్రర్ కోసం కోసం వినియోగించే సాధారణ మోటర్లతోపాటు తాజాగా మార్కెట్‌లో వచ్చిన ఆటోమెటిక్ మెటర్ల కూడా వినియోగిస్తుండటంతో హైస్పీడ్ ప్రెషర్ పెరిగి దిగువ, చివరి కనెక్షన్‌దారులకు∙నీటిసరఫరా అంతంతమాత్రంగా తయారైనట్లు బయటపడింది. నల్లాలకు బిగించే సాధారణ మోటర్లు ఆన్ చేస్తే పనిచేస్తుండగా, ఆటోమెటిక్ మోటర్లు నల్లా సరఫరా ప్రారంభంకాగానే ఆటోమెటిక్‌గా పనిచేయడం ప్రారంభిస్తుండటంతో మిగితా కనెక్షన్లకు పెష్రర్ కూడిన నీటి సరఫరా సమస్యగా తయారైంది.
ALSO READ: RFCL Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.1,00,000 పైగా వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
జూమ్ మీటింగ్‌ల ద్వారా కీలక ఆదేశాలు
జలమండలి ద్వారా సరఫరా జరిగే నల్లా నీరు లో పెష్రర్‌తో కాకుండా ఎప్పటిక మాదిరిగానే సరఫరా జరిగే విధంగా జలమండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రెండు రోజుల క్రితం లో ప్రెషల్ ఫిర్యాదులు అధికంగా గల ఓ అండ్ డివిజన్ 6లోని సుమారు 110 లైన్‌మెన్లతో ఎండీ అశోక్ రెడ్డి ప్రత్యేక జూమ్ మీటింగ్ నిర్వహించారు. లో పెష్రర్ నీటిసరఫరా కారణాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో నీటి సరఫరా, ప్రస్తుతం నీటి సరఫరా ఎంజీడీలు, సమయాల్లో ఎలాంటి తేడా లేనప్పటికి కొన్ని కనెక్షన్‌కు 80 శాతం నీరు, మరికొని కనెక్షన్లకు 20 శాతం నీరు సరఫరా కావడమేమిటని ప్రశ్నించారు. మోటర్లు బిగించే నల్ల కనెక్షన్ల దారులను గుర్తించి, తక్షణమే మోటర్లను సీజ్ చేసి జరిమానా విధించాలని సూచించారు. అదే విధంగా అన్నీ సర్కిల్ సీజీఎం, డివిజన్ జీఎం, డీజీఎం, సెక్షన్ మేనేజర్లతో కూడా జూమ్ మీటింగ్ నిర్వహించి నీరు సరఫరాలో సాధారణ ప్రెషర్ ఉండే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు ప్రత్యేకంగా ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ పేరుతో కార్యాచరణ ప్రకటించారు.
నాలుగు దశలుగా తనిఖీలు
వేసవిలో ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ లక్ష్యంగా నాలుగు దశల తనిఖీలకు జలమండలి సిద్దమైంది. నల్లా నీటి సరఫరాలో లో పెష్రర్‌కు చెక్ పెట్టి సాధారణ స్థాయి వత్తిడితో నీటి సరఫరా జరిగే విధంగా ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ పేరుతో ఈ నెల 15(మంగళవారం) నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ అమలు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో నల్లానీటి సరఫరా సమయంలో లైన్‌మెన్ నుంచి ఎండీవరకు పర్యటించి తనిఖీలు నిర్వహించనున్నారు. వేసవి ముగిసే వరకు అకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి.
❂ మొదటిదశలో లైన్‌మెన్లు వాటర్‌వాల్వ్ తిప్పగానే సరఫరా చేసే లైన్లలో కనెక్షన్ టూ కనెక్షన్ పరిశీలించి వాటర్ ప్రెషర్, మోటర్ల వినియోగాన్ని గుర్తిస్తారు.
❂ రెండో దశలో మరుసటిరోజు (రోజు విడిచి రోజు) సెక్షన్ మేనేజర్ అదే లైన్‌లో నల్లా నీటిసరఫరా.. మోటర్ల వినియోగాన్ని గుర్తించి నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి తక్షణమే మోటర్ సీజ్ చేస్తారు.క్యాన్ నెంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లు పెడుతారు. ఆ తర్వాత లైన్ల వారిగా (క్యాన్‌నెంబర్ల జాబితా)తో ‘మోటర్ ఫ్రీ టాప్‌వాటర్’ లైన్లుగా జీఎంలకు ఆన్‌లైన్ నివేదిక సమరిస్తారు.
❂ మూడో దశలో మేనేజర్ల నివేదిక ఆధారంగా జీఎంలు క్షేత్ర స్థాయిలో లైన్లను ర్యాండమ్‌గా పరిశీలించి సంతృప్తి వ్యక్తమైతే సీజీఎంలకు నివేదిక సమర్పిస్తారు. అక్కడ నుంచి డెరెక్టర్, డైరెక్టర్‌నుంచి మేనేజింగ్ డైరెక్టర్ లాగిన్ కు రోజువారిగా ఆన్‌లైన్ నివేదిక సమర్పిస్తారు.
❂ నాలుగో దశలో ఆ నివేదికలను బట్టి క్రాస్ చెక్ కోసం సీజీఎం, డైరెక్టర్, ఎండీలు క్షేత్ర స్థాయిలో ర్యాండమ్‌గా తనిఖీలు నిర్వహిస్తారు. జరిమానాలు విధించడం, మోటర్లు సీజ్ చేయడంకొనసాగిస్తారు.
తప్పుడు నివేదిక సమర్పిస్తే..
మోటర్ ఫ్రీ టాప్ వాటర్ సర్వేలో ఏ స్ధాయిలో కూడా సమగ్ర పరిశీలన జరపకుండ తప్పుడు నివేదిక సమర్పిస్తే మాత్రం ఆ స్థాయి అధికారి పనితీరు అంచనా వేసి ర్యాంకింగ్ విధించడంతోపాటు మోమోను జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. అదేవిధంగా ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసే డ్యాష్ బోర్డులో ఆన్‌లైన్ ఆధారంగా ప్రతిరోజు నివేదికలను పర్యవేక్షిస్తారు. ఇప్పటికే వాటర్ వాల్స్‌ను జీయోట్యాంగింగ్ చేసి ఆన్‌లైన్ లాగిన్‌కు అననుసంధానం చేశారు. సెక్షన్‌నంచి ఎండీ వరకు పర్యవేక్షించేందుకు వెసులు బాటు కల్పించారు.
ప్రత్యేకమైన యాప్ రూపకల్పన
నీటి నల్లాలకు మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారికి జరిమానా విధించడానికి, జలమండలి సరఫరా చేస్తున్న నీటిని తాగు నీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా నీటి నల్లాలకు మోటార్లను బిగించినా, తాగడానికి కాకుండా ఫ్లోర్లు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం, గార్డెనింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ ఫ్లో, నిర్మాణ పనుల కోసం నీటిని వృధా చేస్తే జరిమానా విధించడానికి ఈ యాప్ ని రూపొందించారు. రెండు రోజుల్లో ఈ యాప్ ని జీఎం నుంచి క్షేత్ర స్తాయిలోని లైన్ మెన్ల వరకు అందరికి అందుబాటులోకి తెస్తారు. వీరు ఆ ప్రాంతాల్లో అక్రమ మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారిని, నీటి వృధా చేస్తున్న వినియోగదారులను గుర్తించి ఫోటో తో సహా యాప్ లో అప్లోడ్ చేయడం.. సదరు కనెక్షన్ గుర్తించి ట్యాగ్ చేయడం తో వెంటనే ఆ కన్స్యూమర్ కనెక్షన్ నెంబర్ పై జరిమానా మంజూరు చేయడంతో సదరు వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్ కు పెనాల్టీ జమ అవుతుంది. అలాగే ఈ మొత్తం వచ్చే నెల బిల్ లో చెల్లించేలాగా రూపొందించారు. అనంతరం రెండో దశలో నీటి సంరక్షణ కోసం చేసేందుకు ఏ పౌరులకు సైతం వాలెంటర్ గా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తారు.
నల్లా మోటర్ బిగించడం చట్టరీత్యా నేరం ..!
మహా నగరానికి తాగు నీరు అందించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ‘అందరికి నీరు సమపాళ్లలో పంపిణీ కావాలి. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు అక్రమంగా మోటార్లు విధిస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. కొందరి వల్ల మిగిలిన వినియోగదారులకు లో ప్రెషర్‌తో నీటి సరఫరా జరుగుతోంది. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం జరిమానా విధించడంతోపాటు మోటార్లు సీజ్ చేస్తాం. ఒకటికి రెండు సార్లు పట్టుబడితే కేసులు పెడుతాం. వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దు. ఒకవేళ తక్కువ ప్రెషర్‌తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తాం’ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ- ఆపరేషన్ డైరెక్టర్ -2 విఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్ -1 అమరేందర్ రెడ్డి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: CM Revanth Reddy: 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినయ్.. ఏఐసీసీ పెద్దల సమక్షంలో రెచ్చిపోయిన సీఎం రేవంత్