Begumpet Heavy Rains: హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా బేగంపేట్, సికింద్రాబాద్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర నీరు పూర్తిగా నిలిచిపోయింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (HYDRA) అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోట్ల సహాయంతో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బేగంపేట్‌తో పాటు సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్థమైంది.
బేగంపేట్‌లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో నీరు రోడ్లపై, ఇళ్లలోకి చేరింది. హైడ్రా బృందాలు వెంటనే రంగంలోకి దిగి, సహాయక చర్యలను చేపట్టాయి. నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లను ఉపయోగించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. అత్యవసర సహాయ బృందాలు, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్ సిబ్బంది నీటిని బయటకు పంపే పనులను వేగవంతం చేశాయి.హైడ్రా కమిషనర్ రంగ నాథ్ కూడా సహాయక చర్యలను దగ్గరుండి పర్య వేక్షిస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో పట్టపగలే చీకటి.. భారీ వర్షాలు, ఈ ప్రాంతాలు జలమయం.. బయటకు వెళ్లొద్దు
ఇదిలా ఉంటే.. రాబోయే రెండు రోజుల్లో కూడా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా హైదరాబాద్‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. మొబైల్ టవర్ల సమీపంలో ఉండకూడదని, బాల్కనీలో ఫోన్‌లో మాట్లాడటం ప్రమాదకరమని హైడ్రా హెచ్చరించింది.
భారీ వర్షాల హెచ్చరికతో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకుని వెంటనే స్పందించాలని తెలిపారు.
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి బేగంపేట్‌లోని ఓ కాలనీ మునిగిపోయింది. 2 నుంచి 3 అడుగుల నీరు నిలిచిపోయింది. దీంతో హైడ్రా సిబ్బంది బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.#Begumpet #Hydra #boats #hyderabad #HeavyRainfall #HeavyRain2025 #HyderabadRains pic.twitter.com/SE1gO4HtSg
— BIG TV Cinema (@BigtvCinema) July 18, 2025