Hyderabad Rajasthan train: హైదరాబాద్ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇది. రోజూ డైరెక్ట్‌గా జోధ్‌పూర్ వెళ్లే రైలు కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపుల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆ కోరిక ఫలించింది. మధ్య భారతదేశాన్ని పశ్చిమ భారతంతో అనుసంధానించే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు.. ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.
తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి జోధ్‌పూర్ (భగత్ కీ కోఠి) వరకు నూతనంగా ప్రారంభమవుతున్న డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మరింత బలోపేతం చేయనుంది. జూలై 20వ తేదీ నుంచి ఈ రైలు రెగ్యులర్ సర్వీసుగా నడవనుండగా, ప్రారంభోత్సవ కార్యక్రమం జూలై 19న కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద జరగనుంది. ఈ వన్ వే స్పెషల్ ట్రైన్ (నంబర్ 07615)ను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి లు కలిసి ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. ఈ రైలు కాచిగూడ నుంచి సాయంత్రం 5:30కి బయలుదేరి, భగత్ కీ కోఠికి జూలై 21 ఉదయం 11:30కి చేరుతుంది.
ఈ కొత్త రైలు ప్రారంభం కేవలం మరో కొత్త రైలు అనే కన్నా, హైదరాబాద్‌లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో రాజస్థానీయులకు, అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాసులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డైరెక్ట్ డైలీ కనెక్టివిటీ కల్పించబోతుంది. ఇప్పటివరకు వారికున్న మార్గాలు సరిగా సౌకర్యవంతంగా లేకపోవడంతో వచ్చిన అసౌకర్యానికి ఇది పరిష్కారంగా మారనుంది. ముఖ్యంగా నాందేడ్, వాశిమ్, ఉజ్జయిన్, రత్లాం, చిత్తోర్గఢ్, భిల్వారా, అజ్మీర్, పాళీ మార్వార్ వంటి ప్రధాన పట్టణాల మీదుగా ఈ రైలు ప్రయాణించనుండటం ప్రయాణికులకు పెద్ద లాభంగా చెప్పవచ్చు.
ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ రాత్రి 11:50కి కాచిగూడ నుంచి బయలుదేరి, రెండో రోజు రాత్రి 8:00కి భగత్ కీ కోఠికి చేరుతుంది. అదే విధంగా భగత్ కీ కోఠి నుంచి ప్రతిరోజూ రాత్రి 10:30కి బయలుదేరే రైలు (17606) రెండో రోజు మధ్యాహ్నం 3:40కి కాచిగూడకు చేరుతుంది. ఈ రైలు రిజర్వ్డ్ డబ్బాలు మాత్రమే కాకుండా అన్‌రిజర్వ్డ్ కోచ్లను కలిగి ఉండటంతో సాధారణ ప్రజలు కూడా ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది.
ఈ కొత్త రైలు ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, ఫ్యామిలీ టూర్లు, వ్యాపార ప్రయాణాల కోసం వెళ్లే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పల్లెటూళ్ల నుంచి బయటకు ఉద్యోగాల కోసం వెళ్ళే వారికి కూడా ఇది చాలా ఉపయోగకర రైలుగా చెప్పవచ్చు. అంతేకాదు, ఈ రైలు భక్తులకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అజ్మీర్ షరీఫ్, చిత్తోర్గఢ్ వంటి పుణ్యక్షేత్రాలు ఈ మార్గంలో ఉండటంతో పుణ్యక్షేత్ర దర్శనాల కోసమూ ఇది అనుకూల మార్గంగా మారుతుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపిన వివరాల ప్రకారం, ఈ రైలు ఒక వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. డైలీ కనెక్టివిటీ ఉండటం వల్ల ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను సౌకర్యంగా ప్లాన్ చేసుకోవచ్చు. టికెట్లకు వచ్చే లభ్యత సమస్యను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాపార పరంగా కూడా ఇది కొత్త ట్రేడ్ రూట్లను బలోపేతం చేస్తుంది. పర్యాటక ప్రాంతాలకూ అనుసంధానం పెరుగుతుంది.
మొత్తానికి ఈ రైలు కేవలం ప్రయాణమే కాదు, రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికి, కుటుంబాల మధ్య సంబంధాలకు, ఉద్యోగ, విద్య, పర్యాటక అవసరాలకు మరింత చేరువ చేస్తూ మధ్య భారతదేశాన్ని పశ్చిమ భారతదేశంతో అనుసంధానించే మరొక ముఖ్యమైన మెట్టు కావడం ఖాయం.