Manmohan Singh: గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్‌కు నివాళులర్పిస్తున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సంతాపం తెలిపారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, పార్టీ నేతలు సంపత్ కుమార్, జేడీ శీలం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు కూడా ఉన్నారు. వారు కూడా మన్మోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
దేశానికి మన్మోహన్ సింగ్ ఎన్నో సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆయన లేకపోవడం దేశానికి తీరని లోటు అని చెప్పారు.
భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరుకానున్నది.
ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ మాట్లాడుతూ… దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని అన్నారు. తెలంగాణకు మన్మోహన్ సింగ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. మన్మోహాన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధమున్నదని అన్నారు. వారెంతో స్థిత ప్రజ్జత కలిగిన దార్శనికులని కొనియాడారు.తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదని కేసీఆర్ చెప్పారు. ఉద్యమం సమయంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారని గుర్తు చేశారు. వారు ప్రధానిగా వున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో తనకు వారందించిన సహకారం మరువలేనిదని.. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ ఘన నివాళులు అర్పించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు. సింగ్ కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీలను ఆదేశించినట్లు కేసీఆర్ తెలిపారు.