CM Revanth Reddy review on MoUs: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (MoUs) పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ఎన్ని కంపెనీలు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాయి..ఏ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపుల పరిస్థితిపై అధికారులు ముఖ్యమంత్రికి సమగ్ర నివేదికను సమర్పించారు.
పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలకు భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చే హామీలను త్వరగా నెరవేర్చాలని, అప్పుడే రాష్ట్రంపై నమ్మకం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఆయా సంస్థలు వీలైనంత త్వరగా తమ కార్యకలాపాలను ప్రారంభించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వినూత్న సూచనలు చేశారు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలను వాటి ప్రాధాన్యతను బట్టి మూడు కేటగిరీలుగా విభజించాలని అధికారులకు సూచించారు. ఇందులో ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ప్రముఖ సంస్థలకు (Major Players) మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
డేటా సెంటర్ల నిర్వహణలో నీటి వినియోగంపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛమైన నీటికి బదులుగా, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని ఈ సెంటర్లకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. దీనివల్ల తాగునీటి వనరులపై భారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, కంపెనీలకు భూముల కేటాయింపుపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులను కోరారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి పెట్టుబడి తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలను తీసుకురావాలని, ఆ దిశగా పారిశ్రామిక అనుకూల విధానాలను మరింత సరళతరం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: బీజేపీలోకి జీవన్ రెడ్డి? ఓ కేంద్ర మంత్రితో రహస్య మంతనాలు? అసలు నిజాలివే..