Congress Leaders: గాంధీ భవన్‌లో ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఉన్న ప్రజా మద్దతును, పార్టీ అంతర్గత పరిస్థితులను వారు విశ్లేషించారు.
ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ప్రజలు ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తోందని.. అందులో భాగంగానే 60 శాతం టికెట్లను బీసీలకు కేటాయించామని తెలిపారు. జనరల్ స్థానాల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించాలని సీఎం, పీసీసీ చీఫ్ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేస్తారని యెన్నెం ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణ కేటీఆర్‌కు రాదని.. ఇప్పటికైనా ప్రతిపక్షంగా ప్రజల కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు. కేసీఆర్ తన వ్యక్తిగత బాధలనే ప్రజల బాధలుగా భావిస్తూ కాలం గడుపుతున్నారని.. అందుకే ప్రజలు ఆయనను ఫాంహౌస్‌లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో బాధ్యత పెరిగిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని చేర్యాల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఓటమికి నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న సమన్వయ లోపమే కారణమని విశ్లేషించారు. అక్కడ కొందరు నేతలు కోవర్టులుగా మారారని.. దీనిపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో కలిసి ‘పోస్ట్‌మార్టం’ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు ఒక నాయకుడికి పదేళ్ల పాటు అవకాశం ఇస్తారని.. 2023 నుండి 2033 వరకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చామల ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ సోషల్ మీడియా సవాళ్లు కేవలం ట్విట్టర్‌కే పరిమితమని.. కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సున్నా రావడమే దీనికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: అద్దం లాంటి రోడ్లే లక్ష్యం.. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష