Fake APK App: ఇటీవల కాలంలో యువత ఎక్కువగా ఫేక్ ఏపీకే యాప్‌ల మోసాలకు గురవుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగ దారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రముఖ న్యూస్, ఇతర అవసరపడే యాప్ ల మాదిరిగా కనిపించే యాప్ లను సృష్టిస్తున్నారు. వీటిని అనధికార వెబ్ సైట్స్ లేదా థర్డ్ పార్టీ యాప్ స్టోర్ ల ద్వారా డిజిటల్ వేదికలపై వదులుతున్నారు. ఈ ఏపీకే ఫైల్ ను ఓపెన్ చేయడం వల్ల భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. వినియోగదారుల పర్సనల్ డేటా, పాస్ట్ వర్డ్స్, బ్యాంక్ ఖాతా వివరాలను, ఫోన్ ను హ్యాక్ చేయడం లాంటివి చేస్తారు. తాజాగా హైదరాబాద్ లో కొంత మంది ఫేక్ ఏపీకే యాప్ ల మోసానికి గురయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం.. దుకాణం బంద్..
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్, చుడిబజార్, బోలాకపూర్‌లో ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయడం ద్వారా ముగ్గురి బ్యాంక్ ఖాతాల్లో రూ.4.85 లక్షల డబ్బులు కోల్పోయారు. దీంతో బాధిత వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీవో చలాన్ ఏపీకే (RTO Challan APK, ), పీఎం కిసాన్ ఏపీకే (PM Kisan APK), కోర్ట్ ఆర్డర్ ఆర్టీవో ఏపీకే (Court Order RTO APK) లతో ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. APK ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మొబైల్ హ్యాక్ అయ్యి OTPలను సైబర్ నేరగాళ్లు తెలుసుకోగలుగుతున్నారు.
ఏపీకే ఫైల్స్‌కు దూరంగా ఉండండి..
బ్యాంక్ ఖాతాల నుండి అనుమతులేని లావాదేవీలు చేస్తున్నారు. దీంతో బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. దీంతో అధికారులు భాగ్యనగర వాసులకు, యువతకు, రాష్ట్ర ప్రజలకు కీలక సూచలను చేశారు. ఎప్పుడూ అధికారిక స్టోర్‌ల నుండి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేయాలని చెప్పారు. ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా భారీ నష్టం జరిగే అవకాశం 99 శాతం ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని.. మోసం జరిగితే వెంటనే 1930 కాల్ చేయాలని పోలీసుల పేర్కొన్నారు.
ALSO READ: Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం
గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి…
ఆకర్షణీయమైన ఆఫర్‌లు, ఉచిత యాప్‌ల వాగ్దానాల ద్వారా ఈ ఏపీకే ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయాలని సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ సెండ్ చేస్తుంటారు. ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. ఈ యాప్‌లు ఫోన్‌లోని పర్సనల్ డేటాను సేకరిస్తాయి. ఈ డేటా అంతటిని రిమోట్ సర్వర్‌లకు పంపుతాయి. ఈ మోసాల నుండి రక్షణ పొందడానికి, Google Play Store లేదా Apple App Store వంటి విశ్వసనీయ సోర్స్‌ల నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవాలని చెబుతున్నారు. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం, ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నవీకరణ చేయడం కూడా సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుందని వెల్లడించారు.