Farmers Protest: జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలంలో అన్నదాతలు కన్నెర్ర చేశారు. పెద్ద ధన్వాడ ప్రాంతంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును అడ్డుకున్నారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను అక్కడి నుంచి తరిమివేశారు.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించారు స్థానికులు. ఈ నేపథ్యంలో గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను ధ్వంసం చేశారు. ఆ కంపెనీకి చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు నిప్పుపెట్టారు అన్నదాతలు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆందోళన చేసినవారిలో రైతులు భారీగా ఉండటంతో వారిని పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. రైతుల ఆందోళనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గతంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ పరిశ్రమ కారణంగా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. భారీ ఎత్తున పొల్యూషన్ వల్ల ఇబ్బందిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయకూడదని ఆరేడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు నాలుగైదు గ్రామాలకు చెందిన రైతులు. దీనిపై నెల రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేశారు.
ALSO READ: మహా ధర్నాలో కవిత.. దూరంగా బీఆర్ఎస్ శ్రేణులు
ఈ సమయంలో అన్ని పార్టీల రాజకీయ నేతలను కలిశారు. పరిశ్రమను ఆపాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం హామీ మేరకు రిలే నిరాహార దీక్షలు విరమించారు. గడిచిన మూడునాలుగు నెలలుగా ఎలాంటి పనులు చేపట్టలేదు ఆ కంపెనీ.
మంగళవారం పరిశ్రమకు సంబంధించి కంటైనర్లు, టెంట్లు, వాహనాలు రావడంతో రైతులలో అలజడి మొదలైంది. పోలీసుల ప్రహారాలో బుధవారం ఉదయం పనులు మొదలుపెట్టారు గాయిత్రీ కంపెనీ ప్రతినిధులు. ఈ క్రమంలో పోలీసులు-రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిశ్రమను ఆపాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.