HCA Ranji: స్వేచ్చ బ్యూరో: వరుస వివాదాలు.. పోలీస్ కేసులు.. అరెస్టులు.. సాగుతున్న న్యాయ విచారణలు అయినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తీరులో మాత్రం మార్పు రావటం లేదు. తాము చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తున్న అసోసియేషన్ లోని కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, రంజీ ట్రోఫీ కోసం సెలెక్ట్ చేసిన జట్టుపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే క్రికెట్ క్లబ్ కు చెందిన వారికి అగ్రతాంబూలం వేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వేర్వేరు జిల్లాల క్రికెట్ ఆటగాళ్లు, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. రంజీ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టును రద్దు చేయాలంటున్నాయి. లేనిపక్షంలో ముంబయిలోని బీసీసీఐ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో ధర్నా జరుపుతామని హెచ్చరించాయి.
క్రికెట్ అభివృద్ధి కోసం పని చేయాల్సిన హెచ్సీఏ ఆ పని తప్ప మిగితా అన్ని పనులు చేస్తోందన్న విమర్శలు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. హెచ్సీఏను కామధేనువుగా మార్చుకున్న కొందరు డబ్బు సంపాదనే ప్రాధాన్యతనిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోర్జరీ డాక్యుమెంట్లతో హెచ్సీఏ అధ్యక్షునిగా ఎన్నికైన జగన్మోహన్ రావుతోపాటు మరికొందరు అసోసియేషన్ సభ్యులపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు జగన్మోహన్ రావుతోపాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ అక్రమాలపై ఇటు సీఐడీ అటు ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. అదే సమయంలో హెచ్సీఏ అక్రమాలపై సిట్ తో విచారణ జరిపించాలని హైకోర్టు డీజీపీకి ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటివరకు జరిపిన విచారణలో వెల్లడైన వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని లోకాయుక్త సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరుగుతున్నా హెచ్సీఏలోని కొందరు తాము అనుకున్నదే చేస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనంగా రంజీ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టునే ఉదహరించవచ్చని క్రికెటర్లే చెబుతున్నారు.
ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ కోసం జరిగే పోటీలో ఆయా రాష్ట్రాలు అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన క్రికెటర్లతో టీములను ఏర్పాటు చేస్తాయి. అయితే, హెచ్సీఏ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించినట్టు యువ క్రికెటర్లు, టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ఆరోపించారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్ల కోసం ఏమాత్రం అన్వేషణ చేయలేదన్నారు.
Also Read: సచిన్ కోడలు ముందే సారా, గిల్ రొమాన్స్…? షాకింగ్ ఫోటోలు వైరల్
జట్టుకు కోచ్ లను నియమించటంలో.. ఆటగాళ్లను ఎంపిక చేయటంలో నెక్ట్స్ జెన్ క్రికెట్ అకాడమీకి పెద్ద పీట వేశారన్నారు. ఈ క్లబ్బుకు చెందిన ఇంద్రశేఖర్ రెడ్డిని సీనియర్ సెలెక్షన్ కమిటీ మెంబర్గా నియమించారన్నారు. ఆయన కొడుకు ఇప్పటికే అండర్ 16 టీములో ఆడుతున్నాడని తెలిపారు. ఇంద్రశేఖర్ రెడ్డి సోదరుని కొడుకు వికాస్ రెడ్డిని రంజీ జట్టుకు ఎంపిక చేశారన్నారు. ఇటీవల జరిపిన టీజీ20 టోర్నమెంట్ లో నెక్స్ట్ జెన్ క్రికెట్ అకాడమీ భాగస్వామి, కోచ్ గా ఉన్నఅనిరుధ్ సింగ్ ను నియమించారన్నారు. ఇప్పుడు రంజీ ట్రోఫీ కోసం సెలెక్ట్ చేసిన జట్టుకు కోచ్ గా పెట్టారన్నారు.
నెక్స్ట్ జోన్ క్రికెట్ అకాడమీలో కోచ్ గా పని చేస్తున్న అభినవ్ కుమార్ ను రంజీ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా నియమించారన్నారు. మరో కోచ్ అభిజిత్ ఛటర్జీని అండర్ 19 నెట్ కోచ్ గా పెట్టారన్నారు. ఇక, నెక్స్ట్ జోన్ క్రికెట్ అకాడమీ భాగస్వామి, కోచ్ అయిన ఆల్ ఫ్రెడ్ అబ్సోలెంను రంజీ జట్టుకు బౌలింగ్ కోచ్ గా నియమించారన్నారు. 33జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రికెటర్లు..కోచ్ లు లేరా? అని ప్రశ్నించారు. అసలు, నిజమైన ప్రతిభను గుర్తించటానికి హెచ్సీఏ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవటం శోచనీయమన్నారు. ఇండియన్ క్రికెట్ జెర్సీని ధరించాలని కలలుగంటూ ఏళ్ల తరబడిగా సాధన చేస్తున్న వారిని పక్కకు పెట్టటం అన్యాయమని వ్యాఖ్యానించారు. అసలు రంజీ జట్టులో తెలంగాణ జిల్లాలకు చెందిన ఒక్క క్రికెట్ ఆటగాడైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు.
హెచ్సీఏ అనుసరిస్తున్న ఏకపక్ష, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ముంబయిలోని బీసీసీఐ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్టు క్రికెట్ ఆటగాళ్లు, టీసీఏ స్పష్టం చేశారు. తాజాగా ఎంపిక చేసిన రంజీ జట్టును వెంటనే రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో ఎదురయ్యే పరిణామాలకు హెచ్సీఏనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
Also Read: హైదరాబాద్కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం