Ganesh Immersion 2026: స్వేచ్ఛ బ్యూరో: పదకొండు రోజుల పాటు గల్లీగల్లీల్లో భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తుది ఘట్టమైన వినాయకుడి నిమజ్జనానికి కోర్ అర్బన్ రీజియన్ సర్వం సిద్దం చేసింది. క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిమజ్జనం కోసం వేర్వేరుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు
ముఖ్యంగా నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు వీలుగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు, హైడ్రా కమిషనర్ తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు సైతం కొద్ది రోజులుగా నిమజ్జనం జరిగే పాయింట్లను నిత్యం సందర్శించి, ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, పోలీసు, జమండలి, ఫైర్, హెచ్ఎండీఏ, మెట్రోరైలు తో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని సింహా భాగం ఏరియా ప్రజలకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
ఊరేగింపులో పాల్గొనే భక్తులకు మౌలిక వసతులు..
నిమజ్జనం ప్రక్రియ వేగంగా, సురక్షితంగా జరగటంతో పాటు నిమజ్జనం రూట్ లో మండపాల నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను ఎప్పటికపుడు సేకరించటంతో పాటు ఊరేగింపులో పాల్గొనే భక్తులకు మౌలిక వసతులను కల్పించేందుకు వీలుగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గణేష్ యాక్షన్ టీమ్ లను సిద్దం చేశారు. ప్రతి కిలోమీటర్లకు ఓ గణేష్ యాక్షన్ టీమ్ రౌండ్ ది క్లాక్ విధులు నిర్వర్తించేలా మూడు షిఫ్టుల్లో కార్మికులను నియమించారు. వారి పనితీరును ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేసేలా నోడల్ ఆఫీసర్లను కూడా నియమించారు.
అధికారుల వ్యూహం సిద్ధం..
నగరంలో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్, ఖైరతాబాద్ బడా గణపయ్యల నిమజ్జనం త్వరగా ముగించేందుకు వివిధ శాఖల అధికారులు వ్యూహాం సిద్దం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ లోని ముఖ్యమైన, చారిత్రాత్మక నిమజ్జన వేదిక హుస్సేన్ సాగర్ చుట్టూ 40 భారీ క్రేన్లను ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు ఏర్పాటు చేయనున్న క్రేన్లలో క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ భారీ గణపయ్యను మధ్యాహ్నాం పన్నెండు గంటల కల్లా నిమజ్జనం పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అలాగే బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు శోభాయాత్రగా రానున్న వినాయకుడ్ని ఎట్టిపరిస్థితుల్లో మధ్యాహ్నాం ఒంటి గంట కల్లా చార్మినార్ దాటించాలని పోలీసు అధికారులు వ్యూహాం రచించారు. ఈ ప్రక్రియను నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ నేరుగా పర్యవేక్షించనున్నట్లు తెలిసింది.
అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద బాలాపూర్ గణపయ్య..
బాలాపూర్ వినాయకుడ్ని అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రెండు గణపయ్యల నిమజ్జనం మధ్యాహ్నాం కల్లా పూర్తి చేయగలిగితే నిమజ్జనం సింహా భాగం ముగిసినట్టేనని అధికారులు భావిస్తున్నారు. కానీ ఈ సారి కూడా నిమజ్జనం శుక్ర, శనివారాలతో పాటు ఆదివారం మధ్యాహ్నాం వరకు కొనసాగేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. మిగిలిన సీఎంసీ, ఎంఎంసీల్లో శనివారం ఉదయం కల్లా నిమజ్జనం పూర్తయ్యే అవకాశాలున్నాయి. గురువారం సాయంత్రం నుంచే ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం ఏర్పాట్లు మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుఝాము నాలుగు గంటలకు బడా గణపయ్యను ప్రత్యేక టస్కర్ పై కి ఎక్కించేలా ఏర్పాట్లు మొదలయ్యాయి.
ఎంఎంసీలో 39 నిమజ్జన కేంద్రాలు, 84 క్రేన్లు
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా ఎంఎంసీ విస్తృత ఏర్పాటు చేసింది. నిమజ్జనానికి వచ్చే భక్తులు, సందర్శకులకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా, పర్యావరణహితంగా నిర్వహించేందుకు రౌండ్ ది క్లాక్ ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఎంఎంసీ పరిధిలోని మూడు జోన్లలో మొత్తం 39 నిమజ్జన పాయింఠ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 18 చెరువులు కాగా, 7 కుంటలు, బేబీ పాండ్లు ఉండగా, 15 కృత్రిమ చెరువులు, పోర్టబుల్ ట్యాంకులున్నట్లు ఆయన తెలిపారు. సరూర్ నగర్, సఫిల్‌గూడ, శామీర్‌పేట్, ఎదులాబాద్ వంటి ప్రధాన చెరువులతో పాటు పార్కులు, క్రీడా మైదానాలు, మార్కెట్ యార్డులలో స్థానిక ప్రజలకు అనువుగా కృత్రిమ నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ జోన్ లో పది నిమజ్జన పాయింట్లు, మల్కాజ్ గిరి జోన్ లో 20 పాయింట్లు, ఎల్‌బీ నగర్ జోన్ లో మరో 9 పాయింట్లతో కలిపి మొత్తం 39 నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. నిమజ్జన పాయింట్లు, ఊరేగింపు మార్గాలు, చెరువులకు వెళ్లే ప్రధాన రహదారుల వద్ద అదనపు వెలుగుల కోసం ఫోకస్ లైట్లు, తాత్కాలిక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు వేలాడుతున్న కేబుళ్లను తొలగిస్తున్నట్లు, ఈ పనులను విలైనంత త్వరగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. వీధి దీపాలు 100 శాతం వెలిగేలా విద్యుత్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించినట్లు తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో చెట్ల కొమ్మలను కత్తిరించడంతో పాటు ప్రతి సర్కిల్‌కు ఒక అత్యవసర హార్టికల్చర్ బృందాన్ని రెండు షిఫ్టుల్లో రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. నిమజ్జన మార్గాల్లో రోడ్లపై ఏర్పడిన గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులు, ఫుట్‌పాత్‌లకు రంగులు వేయడం వంటి పనులు ఇప్పటికే చేపట్టినట్లు, నిమజ్జన కేంద్రాల వద్ద దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో కుక్కల నియంత్రణ కోసం డాగ్ క్యాచింగ్ వాహనాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
168 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాట్లు..
నిమజ్జన రూట్ లో ఎప్పటికపుడు చెత్త, వ్యర్థాల సేకరణ కోసం 1,356 మంది పారిశుద్ధ్య సిబ్బందితో 24 గంటల సేవలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా 168 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు, 13 సర్కిళ్ల పరిధిలోని 56 ఊరేగింపు మార్గాల్లో వాటిని మోహరించి, ఎప్పటికపుడు వ్యర్థాలను సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి గణేష్ మండపం వద్ద చెత్త సంచులను అందుబాటులో ఉంచి, జీఏటీ బృందాలతో కలిసి పారిశుద్ధ్య సిబ్బంది చెత్త, రాళ్లు, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. చెత్తను ప్రతిరోజు, ముఖ్యంగా నిమజ్జన రోజున మినీ టిప్పర్లు, జేసీబీల ద్వారా సేకరించి యార్డుకు తరలించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Also Read: 1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?
84 క్రేన్లు, రెస్క్యూ బృందాలు
ప్రధాన చెరువులు, కుంటలు, కృత్రిమ నిమజ్జన ట్యాంకుల వద్ద 84 స్టాటిక్, మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. వీటిలో ఉప్పల్ జోన్‌లో 19, మల్కాజిగిరి జోన్‌లో 16, ఎల్‌బీ నగర్ జోన్‌లో 49 క్రేన్లు నిమజ్జనం కోసం సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిమజ్జన కేంద్రాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( డీఆర్ఎఫ్ ) బృందాల ఆధ్వర్యంలో ఈతగాళ్లు, పడవలు, లైఫ్ సేవింగ్ పరికరాలను అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులు, సందర్శకుల కోసం 62 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు, నిమజ్జన కేంద్రాల పరిసరాల్లో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పకడ్బందీగా నిమజ్జన ఏర్పాట్లు..
వీటిలో ఉప్పల్ జోన్‌లో 12, మల్కాజ్ గిరి జోన్‌లో 46, ఎల్‌బీ నగర్ జోన్‌లో 4 ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. దీనికి తోడు ప్రధాన నిమజ్జన కేంద్రాలు, అవసరమైన ప్రాంతాల్లో మూడు షిఫ్టుల్లో వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు, క్రేన్ ఆపరేటర్లు, సహాయక సిబ్బంది కోసం ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద విశ్రాంతి గదులతో పాటు అల్పాహారం, భోజన సౌకర్యాలను కూడా కల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకునేలా మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు.
సీఎంసీలో 53 నిమజ్జన పాయింట్లు
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఫైనల్ నిమజ్జనోత్సవాన్ని నిర్వహించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్ పరిధిలోని మూడు జోన్ల పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 53 నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేసి, 82 క్రేన్లను అందుబాటులో ఉంచింది. శేరిలింగంపల్లి జోన్ లో 39, కూకట్ పల్లి జోన్ లో 15, కుత్బుల్లాపూర్ జోన్ లో 22 క్రేన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ మాధిరిగానే సీఎంసీ కూడా నిమజ్జనంలో స్వచ్ఛతకు పెద్ద పీట వేసింది. ఆ రెండు కార్పొరేషన్ల మాదిరిగానే నిమజ్జనం రూట్ లో వ్యర్థాలను ఎప్పటికపుడు సేకరించేందుకు వీలుగా సైబరాబాద్ పరిధిలో కూడా 1145 మంది శానిటేషన్ వర్కర్లు గణేష్ యాక్షన్ టీమ్ లుగా రౌండ్ ది క్లాక్ విధులు నిర్వహించనున్నారు.
నిమజ్జన పాయింట్ల వద్ద 234 మంది గజ ఈతగాళ్లు..
మొత్తం లక్షా 36 వేల 743 విగ్రహాలు నిజమ్జనానికి రానున్నట్లు, ఈ ఊరేగింపులకు దాదాపు 3 లక్షల 70 వేల 520 మంది జనం హాజరుకానున్న అంఛనా వేసిన సీఎంసీ అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం సైబరాబాద్ పరిధిలో 130 మొబైల్ టాయిలెట్లను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు కూకట్ పల్లి ఐడీఎల్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను హడ్రా చేపట్టింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ల పరిధిలోని నిమజ్జన పాయింట్ల వద్ద 234 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచటంతో పాటు 51 డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలను కూడా రంగంలో దింపినట్లు, ఈ బృందాలు క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో చివరి గణేష్ విగ్రహాం నిమజ్జనం అయ్యే వరకు విధి నిర్వహణలో ఉంటాయని అధికారులు తెలిపారు.
Also Read:మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల