Food Adulteration: స్వేచ్ఛ బ్యూరో: కల్తీ దందాపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం (హెచ్ ఫాస్ట్) ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న కల్తీగాళ్ల ఆట కట్టించటానికి ఏర్పాటైన హెచ్ ఫాస్ట్ గణనీయ ఫలితాలను సాధిస్తోంది. ఏర్పాటైన వంద రోజుల్లోనే 185 కేసులు నమోదు చేసిన హెచ్ ఫాస్ట్ బృందాలు 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు, ఆకస్మిక తనిఖీలతో ఆహార కల్తీపై చర్యలు తీసుకుంటోంది.
టాప్ లో రాజేంద్రనగర్ జోన్..
టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన అధికారులు, సిబ్బంది వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేశారు. దాదాపు 121.87 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదయ్యాయి. గోల్కొండ జోన్‌లో 44, సికింద్రాబాద్ జోన్‌లో 35, చార్మినార్ జోన్‌లో 21, శంషాబాద్ జోన్‌లో 13, జూబ్లీహిల్స్ జోన్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులు నమోదయ్యాయి.
కల్తీ ఆహార పదార్థాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కిలోల కల్తీ నిల్వలను పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెడుతూ విక్రయిస్తున్న 16 ముఠాలను అదుపులోకి తీసుకుని 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు 3 కేసుల్లో 9,260 కేజీల నిల్వ పచ్చళ్లు, 4 కేసుల్లో 4,030 కేజీల కల్తీ కోవా, 7 కేసుల్లో 3,897 కేజీల నకిలీ టీ పొడి, 12కేసుల్లో దాదాపు15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం, 3,260 కేజీల కల్తీ క్రీమ్, 530 కేజీల కల్తీ నెయ్యి, 2,706 కేజీల నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం, 2,500 కేజీల కల్తీ పెరుగు, 1,514 కేజీల కల్తీ పనీర్ ను సీజ్ చేశారు.
Also Read: వైసీపీకి మళ్లీ 11 సీట్లు కూడా రావు.. ఓపెన్ ఛాలెంజ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే!
120 కేజీల చికెన్ స్వాధీనం
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 120 కేజీల నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీములు, బిస్కెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్ వంటి వాటికి సంబంధించి 34 కేసులు నమోదు చేశారు. పోలీసు చర్యలతో పాటు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. దీంట్లో అత్యధికంగా పనీర్ అవుట్‌లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై నమోదైన 90 కేసులు ఉన్నాయి. సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై 9, మసాలాలు/స్పైసెస్ పై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6 కేసులు, జెప్టోపై 5, హాస్టళ్లు, మాంసం దుకాణాలపై చెరో 4 కేసులు, ఐస్ తయారీ కేంద్రాలపై 3, చికెన్ వేస్ట్/సీ ఫుడ్‌పై 3 కేసులు నమోదయ్యాయి.
వ్యాపారులకు హెచ్చరికలు..
కల్తీ నియంత్రణతో పాటు నివారణ చర్యలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తదితర తయారీ కేంద్రాలకు చెందిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశాన్ని జరిపారు. వ్యాపారం పేర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పద్ధతులను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. వ్యాపారులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సిబ్బంది గ్లౌజులు, మాస్కులు ధరించడం, నిల్వల్లో పాత నిల్వలను కొత్త నిల్వలను కలపకుండా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని పాటించాలని చెప్పారు. హోటళ్లలో వాడిన నూనెను పదే పదే వాడవద్దని సూచించారు.
హెచ్ ఫాస్ట్ భేష్..
మొదలైన వంద రోజుల్లోనే హెచ్-ఫాస్ట్ సాధించిన ఫలితాలను హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ అభినందించారు. వేర్వేరు శాఖలతో సమన్వయం చేసుకుని హెచ్ ఫాస్ట్ పని చేస్తూ సాధించిన ఫలితాలతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. హెచ్ ఫాస్ట్ కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజు సగటున 15 దాకా కల్తీ ఆహార సమాచారం వస్తోందన్నారు. కల్తీ దందాను కేవలం ఒక చిన్నపాటి వ్యాపార మోసంగానో లేదా నిబంధనల ఉల్లంఘనగానో చూడటం లేదన్నారు.
Also Read: గచ్చిబౌలి IIITలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య
కల్తీ దందాపై పీడీ యాక్ట్
ఇది ప్రజల ఆరోగ్యంతో, అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఓ ఘోరమైన హత్యాయత్నం అని వ్యాఖ్యానించారు. కల్తీ దందా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా, లేదా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిసినా వెంటనే డయల్ 100, లేదా హెచ్ ఫాస్ట్ నెంబర్ 8712661212కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.