Hydra Contact Number: చెరువులలో మట్టి పోసి, ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించే వారికి చెక్ పెట్టేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల చెరువుల కబ్జాలపై దృష్టి సారించిన హైడ్రా.. కీలక ప్రకటన చేసింది. చెరువులలో మట్టి పోస్తున్న వారి సమాచారం తమకు అందజేయాలని కమిషనర్ రంగనాథ్ కోరారు.
హైడ్రా.. ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ నగరంలోని ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో తమవంతు ఎప్పుడొస్తుందోనంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఇన్నాళ్లూ ఫిర్యాదుల స్వీకరణ విషయంలో పరిమితంగా వ్యవహరించిన హైడ్రా, ప్రస్తుతం నేరుగా సామాన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ దిశగా అడుగులు వేస్తోంది. సామాన్య జనాలే నేరుగా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని హైడ్రా కల్పించడంతో ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా వెలుగులోకి వచ్చే ఆక్రమణలు కూడా పెరిగాయి. పలుచోట్ల స్థానిక ప్రజలు కలిసికట్టుగా కూడా ఫిర్యాదులు చేశారు. అయితే ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంల సామాన్యుల నుంచే ఫిర్యాదులు స్వీకరించాలని హైడా నిర్ణయించింది.
అందుకే ప్రతి సోమవారం కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఇటీవల ఆ ఫిర్యాదుల మేరకు పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. అంతేకాదు హైడ్రా తీసుకుంటున్న చర్యలకు ప్రజల మద్దతు లభిస్తుండగా, త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడ ఏర్పాటు కాబోతోంది. అయితే చెరువుల పరిరక్షణకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులలో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నంబరును 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు.. కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ఈ క్రతువులో చేతులు కలపాలని హైడ్రా కోరింది.
Also Read: Hyderabad Weather: హైదరాబాద్ కు ముందే వచ్చిన వేసవి.. 5 రోజులు భగభగలు..
48 కేసుల నమోదు..
రాత్రి పగలూ నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకుని సంబంధిత వ్యక్తులపై హైడ్రా కేసులు పెట్టింది. ఇందులో లారీ ఓనర్లతో పాటు.. నిర్మాణ సంస్థలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ నిఘాను తీవ్రతరం చేసి.. చెరువుల్లో మట్టి నింపుతున్న వాహనదారులతో పాటు.. మట్టి తరలించే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. హైడ్రా తీసుకున్న నిర్ణయంతో చెరువుల ఆక్రమణలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని ఈ నిర్ణయం తీసుకుంది.