Karimnagar Bandh: కరీంనగర్ వేదికగా గత రెండు రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై, అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు (శనివారం) కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దీనికి నిరసనగా వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని గులాబీ దళం కోరుతోంది.
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ముదురుతున్న ‘కౌశిక్ రెడ్డి’ వివాదం
ఈ గొడవకు ప్రధాన కేంద్రం హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. బీజేపీకి చెందిన కీలక నేతలపై ఆయన చేసిన విమర్శలతో ఆగ్రహించిన కమలదళం నేరుగా ఆయన కార్యాలయంపైకి వెళ్లడం, ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరగడం పరిస్థితిని విషమింపజేశాయి. నేడు జరగనున్న బంద్ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధమవుతుండగా, బీజేపీ కూడా దీన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. దీంతో నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది.
ప్రభుత్వ హెచ్చరిక.. కాంగ్రెస్ కౌంటర్ వ్యూహం!
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య వ్యక్తిగత విభేదాలు లేదా రాజకీయ పోరాటాల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని హెచ్చరించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బంద్‌పై ఘాటుగా స్పందించింది. “బీఆర్ఎస్, బీజేపీలు రెండూ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ఈ బంద్‌లో ప్రజలెవరూ పాల్గొనవద్దని” కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అనవసరంగా షాపులు మూసివేసి నష్టపోవద్దని వ్యాపారులకు సూచించారు.
పోలీసుల హై అలర్ట్.. కరీంనగర్ అంతటా భారీ బందోబస్తు
బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం నలుమూలలా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అదనపు బలగాలను మోహరించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉన్న ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. బంద్‌కు అనుమతి లేదని, బలవంతంగా ఎవరైనా దుకాణాలు మూయించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: వ్యవస్థలు గాడి తప్పాయా? సోషల్ మీడియా అరెస్టులపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు!
బండి సంజయ్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత.. కమలాకర్ హౌస్ అరెస్ట్
రాజకీయ సెగలు పెరగడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ని హౌస్ అరెస్టు చేసారు పోలీసులు.. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాన్ని ‘రెడ్ జోన్’గా ప్రకటించి, ఎవరినీ అనుమతించడం లేదు. ఇటు రాజకీయ నాయకుల సవాళ్లు, అటు పోలీసుల లాఠీలు.. వెరసి కరీంనగర్ ప్రస్తుతం ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తోంది. ఈ బంద్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది? శాంతిభద్రతలు ఎలా ఉంటాయి? అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
నేడు కరీంనగర్ బంద్‌కి పిలుపునిచ్చిన బీఅర్ఎస్
కౌషిక్ రెడ్డిపై, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై బీజేపీ దాడి నేపథ్యంలో పిలుపు
బీఅర్ఎస్, బీజేపీల మధ్య గొడవలతో ప్రజలని ఇబ్బంది పెట్టొద్దన్న ప్రభుత్వం
ఎవ్వరూ బంద్‌లో పాల్గొనవద్దని పిలుపునిచ్చిన కాంగ్రెస్
బంద్ నేపథ్యంలో పోలీసుల హై అలెర్ట్… pic.twitter.com/Pzi1IMSzhO
— BIG TV Breaking News (@bigtvtelugu) May 9, 2026