E-Paper
Advertisement

సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు!

సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు!
Advertisement

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: దక్షిణ భారతదేశంలో ఏకైక ప్రధాన బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రానున్న రోజుల్లో తన సేవలను మరింత విస్తృతం చేయాలని, కొత్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటును అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో శనివారం సింగరేణి సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి గనుల ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపునకు సంబంధించిన వివరాలను కొత్త గనులు వాటి ఉత్పత్తి వివరాలు, అనుమతుల స్థితిగతులపై గనుల వారీగా కూలంకశంగా సమీక్షించారు.

సమగ్ర కార్యాచరణ ప్రణాళికను  సిద్ధం

Advertisement

సింగరేణి సంస్థ  బొగ్గు ఉత్పత్తి పెంచడం కోసం అవసరమైన కొత్త బ్లాక్ లను బొగ్గు శాఖ నిర్వహించే వేలం పాటలో పాల్గొని సాధించాలని సూచించారు. దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 10 నుంచి 15 సంవత్సరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశ ఇంధన రంగంలో ఇంకా సుదీర్ఘ కాలం బొగ్గు కీలక పాత్ర పోషించనున్నదని కనుక బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై దృష్టి సారించాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ, పని సామర్థ్యాన్ని మరింతగా పెంచే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాలి

Advertisement

సంస్థ వాణిజ్యపరమైన విజయాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. నేటి పోటీ మార్కెట్ లో ప్రభుత్వ సంస్థలు నిలబడాలంటే నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవడంతోపాటు ప్రతీ ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కనుక కార్మికులకు సంస్థ స్థితిగతులపైన సరైన అవగాహన కలిగించడానికి కృషి చేయాలన్నారు. కంపెనీ అభివృద్ధికి, సంస్కరణల అమలుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించుకోవాలన్నారు. సమష్టిగా సింగరేణి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని. సంస్థ అభివృద్ధికి తాము పూర్తి సహకారం అందిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Also Read: రంకెలతో అంకెలు మారవు.. ఏ చర్చకైనా సిద్ధం.. హరీశ్ రావు సవాల్!

కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టడంపై దృష్టి

దేశంలో కోల్ గ్యాసిఫికేషన్ కు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైన ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా  ప్రారంభ దశలో చిన్న స్థాయిలో అయినా  కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టడంపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఫెర్టిలైజర్స్ తదితర పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కోల్ గ్యాసిఫికేషన్ కు పూనుకోవాలన్నారు.

విద్యుత్ ఉత్పత్తికి నిరంతర ఇంధన సరఫరా

ప్రపంచ వ్యాప్తంగా, భారత దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో వ్యవసాయ, ఇతర పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ ఉత్పాదనకు తగినంత బొగ్గు అందించడానికి కోలిండియా తోపాటు సింగరేణి కూడా సంసిద్ధంగా ఉండాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను ముందుగానే బలోపేతం చేసి విద్యుత్ ఉత్పత్తికి నిరంతర ఇంధన సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

రవాణా వ్యవస్థ బలోపేతం

బొగ్గు ఉత్పత్తి పెంపునకు అనుగుణంగా రవాణా వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. రవాణా కాంట్రాక్టులను అత్యంత వేగంగా ఖరారు చేసి అమలు చేయడం ద్వారా అదనపు ఉత్పత్తి సకాలంలో వినియోగదారులకు చేరేలా చూడాలని సూచించారు. ఇదిలాఉండగా ఈ సమావేశానికి తాను స్వయంగా సింగరేణి కార్మికుల నీలిరంగు యూనిఫామ్ ధరించి హాజరవడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ఇది కేవలం యూనిఫామ్ కాదని, సింగరేణి కార్మికుల చెమట చుక్కను ప్రతిబింబించే త్యాగమని కొనియాడారు. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా బొగ్గు కంపెనీల్లో కార్మికులు ధరించే యూనిఫామ్ ధరించే సాంప్రదాయాన్ని నిరంతరం కొనసాగించడం వల్ల తనకు సంతృప్తి కలుగుతుందన్నారు.

Also Read: Free Feeder: బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..!

ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం

సింగరేణి అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో ఉద్యోగులను భాగస్వాములుగా చేసుకుని వారి విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి సంస్థ విజయాన్ని తన విజయంగా భావించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలాఉండగా సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ.. సింగరేణి లో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ప్రస్తుత సవాళ్లను కేంద్ర మంత్రికి వివరించారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎదురవుతున్న పలు సవాళ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం..

ముఖ్యంగా సింగరేణికి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ స్టేటస్ తొలగించడం వల్ల అటవీ భూ సేకరణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాగా ఈ అంశంపై అతి త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు రవాణా విషయంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ కస్సి, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రైవేట్ సెక్రటరీ పంకజ్ జైన్, బొగ్గు శాఖ సలహాదారులు వీరా రెడ్డి, సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, తిరుమలరావు, ఈడీ వెంకన్న, జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రికి వినతి

సింగరేణి బొగ్గు దొంగతనం, సంస్థ మనుగడ, కార్మికుల సమస్యలు, నైనీ బ్లాక్ టెండర్ల ప్రక్రియ వంటి అంశాలను పరిష్కరించాలని, అలాగే తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరు జిల్లాల బీజేపీ అధ్యక్షులు, సీనియర్ నేతలు బృందం వినతిపత్రం అందజేసింది. సింగరేణిలో అనేక సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించింది. సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉందని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.52 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించింది. ఈ బకాయిల వల్ల.. కనీస సౌకర్యాలు లేకుండా సింగరేణి కార్మికులు ఉన్నారని పేర్కొంది. వెంటనే ఈ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. సింగరేణి బొగ్గు దొంగతనం గురించి క్షేత్ర పరిశీలనకు బీజేపీ ప్రతినిధులు వెళ్తే ప్రభుత్వం అడ్డుకుందని ఈ బృందం కేంద్ర మంత్రికి వివరించింది. గత బీఆర్ఎస్ సింగరేణిని దోచుకున్నట్టే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణినీ దోచుకుంటోందని ఆరోపించింది.

Also Read: మేము గుర్తులేమా? ఖుష్బూపై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

Related News

Solar Mandal: దేశానికే ఆదర్శంగా సీఎం రేవంత్ నియోజకవర్గం..!

రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ.. ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్!

Free Feeder: బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..!

రంకెలతో అంకెలు మారవు.. ఏ చర్చకైనా సిద్ధం.. హరీశ్ రావు సవాల్!

‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Farmhouse Rules: హైదరాబాద్ ఫార్మ్‌హౌస్ ఓనర్లకు కొత్త రూల్స్.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఫార్మ్‌హౌస్‌లు సీజ్!

Show Cause: కాంగ్రెస్‌లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!

Big Stories

Advertisement
×