Konda Family: రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ అంశం కలకలం రేపుతున్నప్పటికీ, కాంగ్రెస్ మంత్రివర్గంలోని సీనియర్ నేతలంతా తీవ్ర మౌనం పాటిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం మధ్య నడుస్తున్న ఈ వివాదంలో ముందస్తుగా స్పందించి చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ తో సహా కీలక నేతలంతా ‘వెయిట్ అండ్ వాచ్’ ధోరణిని అవలంబిస్తున్నారు.
అంతేగాక సుస్మిత సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా ఘాటూగానే విమర్శలు చేసింది. కానీ ఆయన కూడా ఇప్పటి వరకు ఎలాంటి రీయాక్షన్ ఇవ్వలేదు. దీంతో అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నదా? అనే అంశాపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇక పలువురు ఎమ్మెల్యేలు కూడా ఎవరి వైపు నిలుస్తారనేది సస్పెన్స్ గా మారింది. సీఎం చెప్పిన తర్వాత దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మిగతా ఎమ్మెల్యేల వైఖరి తెలుసుకునేందుకు సీఎం టీమ్ ప్రయత్నాలు చేయడం గమనార్హం.
Also Read: నాణేలు, నోట్లు ఎక్కడ ముద్రిస్తారు? RBI, కేంద్రం పాత్ర ఏంటి? మైండ్ బ్లోయింగ్ నిజాలు!
కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైన వైఖరి తీసుకోబోతున్నారనే దానిపై స్పష్టత వచ్చే వరకు ఏ ఒక్కరూ బహిరంగంగా నోరు విప్పకూడదని మంత్రులు భావిస్తున్నారు.వ్యక్తిగత-పార్టీ సంబంధాల నడుమ నలిగిపోతున్న నేతలు: కొండా ఫ్యామిలీతో ఉన్న పాత సంబంధాలు ఒకవైపు, ప్రభుత్వ స్థిరత్వం-పార్టీ క్రమశిక్షణ మరోవైపు ఉండటంతో మంత్రులు తీవ్ర ధర్మసంకటంలో పడ్డారు.అంతేగాక తొందరపడి ఏ వైపో ఒకవైపు మొగ్గు చూపితే పార్టీలో వర్గపోరు పెరిగే ప్రమాదం ఉందని,అది ప్రభుత్వ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందని సీనియర్లు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో అటు కొండా ఫ్యామిలీ చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, ప్రజల నుంచి వస్తున్న స్పందనలు వంటివన్నీ మంత్రులంతా ఫాలో అవుతున్నారు.
ఈ వివాదం మరింత తీవ్రమైతే మంత్రులంతా సీఎం రేవంత్ రెడ్డి వైపు నిలబడతారా? లేక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబానికి మద్దతుగా నిలుస్తారా? అనేది సస్పెన్సగా మారింది. ఇక మంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరిచే ఆలోచనలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి రాజకీయాలు, సొంత సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి, అధిష్టానం కలిసే ఈ వివాదానికి పరిష్కారం చూపుతారనే ఆశతోనే ప్రస్తుతానికి ఈ “వ్యూహాత్మక మౌనం” కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా కొండా ఫ్యామిలీ కాంట్రవర్సీ ఎపిసోడ్ గా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రులంతా తమ తమ శాఖల రివ్యూలు, విజిట్ చేసుకుంటూ సజావుగా సైలెంట్ గా ముందుకు సాగడం రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
Also read: జీహెచ్‌ఎంసీలో నాన్-లోకల్ అధికారుల పైరవీలు.. ఈఎంఐ కట్టాలంటూ లంచాలు డిమాండ్!