Patancheru Incident: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలపై టీపీసీసీ అగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన అనుచరులు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలను బూతులు తిడుతున్నారని కార్యకర్తలు ఆందోళన చేసిన విషయం విదితమే. అయితే ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు రోడ్డెక్కడం పట్ల పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు దాడితో ఇరు వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్న విషయం తెలిసిందే.
పటాన్ చెరు నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతుండడంతో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లేఖ ద్వారా విచారణకు కమిటీనీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఆర్‌జీ వినోద్ రెడ్డి కమిటీ సభ్యులుగా కూడా నియమించారు. పటాన్ చెరులో జరుగుతోన్న సంఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు.
అయితే.. పటాన్ చెరు ఘటనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చర్చలు జరిపారు. జరుగుతోన్న ఘటనలపై మహిపాల్ రెడ్డితో చర్చలు జరిపారు. ఆయన అభిప్రాయాలను కూడా వెల్లడించారు. పటాన్ చెరులో అమీన్ పూర్‌లో కాంగ్రెస్ నేతలతో చర్చించినట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘జిల్లా నేతల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తాం. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు నివేదిక అందిస్తాం. జరిగిన సంఘటనలు సీఎం రేవంత్ రెడ్డికి కూడా వివరిస్తాం. అందరితో చర్చించి రెండు మూడు రోజుల్లో నివేదిక అందిస్తాం. గాంధీ భవన్‌కు రాలేక కాదు. సరైన స్థలం అనుకొని హిమాయత్ నగర్ లో సమావేశం అయ్యాం. ఈ కమిటీతో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనుకుంటున్నాం’ అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
‘పటాన్‌చెరు నియోజకవర్గ నేతలతో చర్చించేందుకే టీపీసీసీ చీఫ్ కమిటీని నియమించారు. నాలుగు రోజులుగా చర్చలు జరుపుతున్నాం. ఇవ్వాళ గూడెం మహిపాల్ రెడ్డితో చర్చలు జరిపాం. పటాన్ చెరుకు సంబంధించి పలు విషయాలు చెప్పారు. గూడెం మహిపాల్ రెడ్డి కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు తెలియజేశారు’ అని పేర్కొన్నారు.
Also Read: NTPC Recruitment 2025: బీటెక్ అర్హతతతో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం.. పూర్తి వివరాలివే..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పటాన్‌చెరులో ఎవరిని అగౌరవ పరచలేదు.. అలాంటి ప్రవర్తన నా జీన్స్‌లో లేదు. నేను కూడా గతంలో కాంగ్రెస్‌లో పని చేశాను. తర్వాత BRSలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశాను. ఎప్పుడైనా నేను అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను. క్యాంపు ఆఫీస్ మీద దాడి జరిగింది. ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం మాత్రమే అయ్యింది. హనుమంతుడు రాముడి ఫోటో మెడలో వేసుకొని తిరిగాడు. అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తాను’ అని అన్నారు.