HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ డివిజన్ పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాయి శ్రీ వెంచర్ ఇండ్ల యజమానుల పోరాటం ఫలించింది. ఎన్నో ఏళ్లుగా పార్కు స్థలం కబ్జా, డ్రైనేజీ నిర్మాణం విషయమై వెంచర్ సంక్షేమ సంఘం పోరాటం చేస్తోంది. పార్కు కోసం కేటాయించిన స్థలం కబ్జా కావడంతో దానిని తిరిగి పొందలేకపోయారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ఈ రెండు సమస్యలకు పరిష్కారం లభించింది.
వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పారిశ్రామికవాడలోని సర్వే నంబర్లు 878, 882లలోని 13 ఎకరాల 31 గుంటల భూమిలో 2011లో సాయి శ్రీ వెంచర్ పేరుతో లేఔట్ రూపొందించారు. 2013 నుంచి ప్లాట్ల విక్రయం చేపట్టారు. మొత్తం 187 గజాల చొప్పున 250 ప్లాట్లు ఏర్పాటు చేశారు. వాటిలో 1970 గజాలను పార్కు కోసం కేటాయించారు. 2014 నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా, 2018 నాటికి దాదాపు అన్ని ప్లాట్లలో ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అయితే వెంచర్ నిర్వాహకులు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేదు. ప్రారంభంలో తక్కువ మంది నివసించడం వల్ల ఇబ్బందులు కనిపించలేదు. క్రమంగా నివాసితులు పెరగడంతో డ్రైనేజీ సమస్య తీవ్రమైంది. ఖాళీ ప్లాట్లలో మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు, ఈగలు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా పార్కు కోసం కేటాయించిన 1970 గజాల స్థలంలో 400 గజాలను రెండు ప్లాట్లుగా విభజించి విక్రయించారు.
Also read: Illegal Mining: గద్వాల్లో మట్టి మాఫియా అరాచకం.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి..!
పార్కు స్థలం కబ్జా తొలగింపు, డ్రైనేజీ నిర్మాణం కోసం సాయి శ్రీ వెంచర్ నివాసితులు దాదాపు ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. 1970 గజాల్లో 400 గజాలను ఆక్రమించి విక్రయించిన విషయం తెలుసుకున్న నివాసితులు ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిగిలిన స్థలం రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోగలిగారు. కానీ ఆక్రమిత స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారు. డ్రైనేజీ నిర్మాణం కోసం మున్సిపాలిటీ నుంచి నిధులు విడుదలైనా, పలువురు పట్టాదారుల అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. అనంతరం నివాసితుల డిమాండ్ మేరకు వెంచర్ ప్రధాన రోడ్డులో డ్రైనేజీ నిర్మించారు. అయితే అది 250 ప్లాట్లలో కేవలం 50–80 ఇళ్లకే ఉపయోగపడింది. రెండు సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నివాసితులు మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసినా ఫలితం లేకపోవడంతో చివరకు పూర్తి స్థాయి పత్రాలతో హైడ్రాను ఆశ్రయించారు.
హైడ్రా అధికారులు సిబ్బందితో కలిసి శనివారం సాయి శ్రీ వెంచర్‌కు చేరుకుని, ఆక్రమించిన 400 గజాల స్థలంలో నిర్మించిన ప్రహరీని తొలగించారు. మొత్తం 1970 గజాల పార్కు స్థలాన్ని మున్సిపాలిటీకి స్వాధీనం చేశారు. అలాగే లేఔట్‌లో డ్రైనేజీ కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులకు సహకరించి, ఎవరూ అడ్డుపడకుండా చర్యలు చేపట్టారు. దాదాపు 20–30 ఏళ్లుగా ప్రతిపాదిత డ్రైనేజీ స్థలంలో రోడ్డు ఉండటంతో, ఆ రోడ్డు కింద నుంచి డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. హైడ్రా ఆధ్వర్యంలో యంత్రాల సహాయంతో పనులను వేగంగా పూర్తి చేశారు. అయితే ఇందుకు అయ్యే ఖర్చును సాయి శ్రీ వెంచర్ నివాసితులే భరించారు. ఈ సందర్భంగా నివాసితులు మాట్లాడుతూ, డ్రైనేజీ నిర్మాణంతో వెంచర్‌లోని కుటుంబాలతో పాటు మరో 100 కుటుంబాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పార్కు స్థలాన్ని కబ్జా నుంచి విముక్తి చేయడంతో పాటు డ్రైనేజీ నిర్మాణానికి సహకరించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also read: వైసీపీకి మళ్లీ 11 సీట్లు కూడా రావు.. ఓపెన్ ఛాలెంజ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే!