హిందూ మహాసముద్రంలో ఉన్న అందమైన ద్వీప దేశం మారిషస్. దీనిని ‘మినీ ఇండియా’ అని పిలుస్తారు కూడా. భారత్ కు దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, భాషలు అచ్చం భారతీయ జీవనశైలిని గుర్తు చేస్తాయి. అందుకే, మారిషస్ ను చాలామంది భారత్ కు అత్యంత దగ్గరైన విదేశీ దేశంగా భావిస్తారు.
70 శాతం మంది భారతీయ సంతతి ప్రజలే!
మారిషస్ జనాభాలో దాదాపు 70 శాతం మంది భారతీయ సంతతికి చెందినవాళ్లే ఉన్నారు. వారి పూర్వీకులు ఎన్నో సంవత్సరాల క్రితం భారత్ నుంచి అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. ఇప్పటికీ భారతీయ సంస్కృతి అక్కడ బలంగా కొనసాగుతోంది. అంతేకాదు, దీపావళి, హోలీ, మహాశివరాత్రి లాంటి పండుగలను మారిషస్ లో అట్టహాసంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలను జరుపుకోవడం అక్కడ సాధారణంగా కనిపిస్తుంది. భారతీయ వంటకాలు, సంప్రదాయ దుస్తులు, ఆచార వ్యవహారాలు కూడా అక్కడి ప్రజల జీవితంలో భాగంగా ఉన్నాయి. భాషల పరంగా కూడా మారిషస్ కు భారత్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ భోజ్ పురి, హిందీ, తమిళం, మరాఠీతో పాటు తెలుగు కూడా మాట్లాడుతారు. భారతీయ మూలాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ భాషలకు అక్కడ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు.
మారిషస్ లో భారతీయులకు ఉన్న అనుబంధానికి చాలా నేపథ్యం ఉంది. 1834 తర్వాత బ్రిటిష్ పాలనలో చెరకు తోటల్లో పని చేయడానికి ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది కార్మికులు అక్కడికి వెళ్లారు. నెమ్మదిగా వారు అక్కడే స్థిరపడి తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించారు. ప్రస్తుతం వారి వారసులే అక్కడి ప్రధాన జనాభాగా ఉన్నారు.
రాజకీయ రంగంలో కూడా భారతీయ సంతతి నాయకుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మారిషస్ లో ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులను కూడా భారతీయ మూలాలు కలిగిన నాయకులు పొందడం కామన్ గా కనిపిస్తుంది. భారత్-మారిషస్ మధ్య దౌత్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు కూడా చాలా బలంగా కొనసాగుతున్నాయి.
తెలుగు ప్రజలకు కూడా మారిషస్ తో ప్రత్యేక బంధం ఉంది. అక్కడ తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగు భాషను కాపాడేందుకు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు తెలుగును బోధిస్తున్నారు. కొత్త తరాలకు కూడా తెలుగు భాష, సంస్కృతిని అందిస్తున్నారు. మారిషస్ ఆంధ్ర మహాసభ లాంటి సంస్థలు తెలుగు భాష, సంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉగాది, సంక్రాంతి వంటి తెలుగు పండుగలను కూడా అక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. మారిషస్ లోని తెలుగు కుటుంబాలు తమ మూలాలను మరచిపోకుండా తరచూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సందర్శిస్తూ బంధువులను కలుసుకుంటారు.
మారిషస్ కేవలం ఒక ద్వీప దేశం మాత్రమే కాదు. భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా తెలుగు వారసత్వాన్ని ఇప్పటికీ గౌరవంగా కాపాడుకుంటున్న దేశంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీనిని మినీ ఇండియాగా పిలుస్తున్నారు.
Read Also: ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న భోగాపురం ఎయిర్ పోర్ట్.. లోపల చూస్తే కళ్లు చెదిరిపోవల్సిందే!