Transfers: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోని అధికారులు, ఉద్యోగుల పక్షాళనకు రంగం సిద్దమైంది. మూడు కార్పొరేషన్లు ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ల వారీగా కావల్సిన సిబ్బంది, అధికారుల వివరాలతో కార్పొరేషన్ల కమిషనర్లు స్టాఫ్ ప్యాట్రన్ ప్రతిపాదనలు పంపినా, సర్కారు ఇంకా దాన్ని పెండింగ్ లోనే పెట్టింది. దీంతో వివిధ విభాగాల వారీగా ఉన్న అధికారులు, సిబ్బందితోనే సరి పెట్టుకోవాలని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు భావించాయి. కానీ అంతలోనే గత నెల రోజుల క్రితం మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, ఇతర విభాగాల్లోకి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో అక్రమాలు జరిగాయన్న విషయం వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు పాటించలేదన్న కారణంతో సప్పెన్షన్ కు గురైన ఓ ఇంజనీర్ కు కూడా ఈ బదిలీల్లో చోటు కల్పించటం అనుమానాలు, అక్రమాలు జరిగాయన్న వాదనకు బలాన్ని చేకూర్చాయి. అప్పటి నుంచి ఆదేశాలను పెండింగ్ లో ఉంచిన సర్కారు ఎట్టకేలకు దాన్నిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఉత్తర్వుల్లో బదిలీలు, పదోన్నతులు పొందిన ఇంజనీర్లను మళ్లీ బదిలీలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, క్యూర్ అర్బన్ ఏరియా స్పెషలాఫీసర్ జయేష్ రంజన్ తో కమిషనర్లు ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది.
ఈ మేరకు బుధవారం మూడు కార్పొరేషన్ల కమిషనర్లు అంతర్గతంగా వివిధ విభాగాల అధికారులతో ఈ బదిలీలపై సమావేశం నిర్వహించి, ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలకు సంబంధించిన జాబితాను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ముఖ్యంగా ఇంజనీర్ల బదిలీలపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ మొదలుకుని సూపరింటెండెంట్ ఇంజనీర్ వరకు మొత్తం బదిలీలు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు సైబరాబాద్, జీహెచ్ఎంసీ కార్పొరేషన్లలో తరుచూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ బదిలీలకు సంబంధించి నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం.
Also Read: GHMC: హైదరాబాద్‌కి మొదలైన చీకటి కష్టాలు.. మూడు నెలలైన దక్కని మోక్షం..!
చాలా మంది పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు పైరవీలు, రాజకీయ సిఫార్సులతో పాటు అమ్యామ్యాలు చెల్లించుకుని గత నెల బదిలీలు పొందినట్లు సర్కారు నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. వీరిలో జీహెచ్ఎంసీలో పోస్టింగ్ లు దక్కించుకున్న ఇంజనీర్లను మరోసారి బదిలీలు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు, ఈ విషయంపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలిసింది. గత నెల రోజుల క్రితం జారీ చేసిన పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల బదిలీల ఉత్తర్వులు, వాటి వెనకానున్న సూత్రధారాని సైతం సర్కారు గుర్తించినట్లు, త్వరలోనే ఆ కీలక అధికారిపై కూడా చర్యలుంటాయన్న వాదనలున్నాయి.
ముఖ్యంగా రెండు రోజుల క్రితం ఒకే రోజు ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు రిటైర్డు కావటంతో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఇంజనీర్ల సంఖ్య జీహెచ్ఎంసీలో గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ సిటీ వంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయంపై కూడా బుధవారం జరిగిన అంతర్గత సమావేశాల్లో కమిషనర్లు విభాగాధిపతులతో చర్చినట్లు విశ్వసనీయ సమాచారం. గత నెల జారీ అయిన ఇంజనీర్ల బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీకి బదిలీ అయిన పది మంది ఇంజనీర్లకు కూడా బదిలీలు చేయాలని, వారికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్న విషయంపై మూడు కార్పొరేషన్ల కమిషనర్లు స్పెషలాఫీసర్ తో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.
మల్కాజ్ గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ విభాగాల్లో అధికారులను గత ఫిబ్రవరి 11న నియమించిన సంగతి తెల్సిందే. ఈ రెండు కార్పొరేషన్లలోని వివిధ విభాగాధిపతులతో పాటు పలు ముఖ్యమైన విభాగాల్లోని అధికారులకు కూడా అంతర్గతంగా బదిలీలు చేయాలని కమిషనర్లు నిర్ణయించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ మూడు ముక్కలుగా పునర్విభజించక ముందు నుంచి, మూడు ముక్కలైన తర్వాత నేటికీ జీహెచ్ఎంసీ పరిధిలోనే విధులు నిర్వహిస్తున్న అధికారులను గుర్తించి, వారికి కూడా స్థానచలనం కల్గించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మూడు కార్పొరేషన్లలో కూడా దాదాపు అన్ని విభాగాల్లో సిబ్బంది కొరత కొనసాగుతున్నా, ఉన్న వారికే అదనపు బాధ్యతలను, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి, అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఈ బదిలీలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also read: Public Schools: ఆరుట్ల సక్సెస్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. వచ్చే 3 నెలల్లో ఆ మూడు ఓపెన్..?