Rythu Commission: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, అన్నదాతల హక్కులను కాపాడటంలో ‘రైతు కమిషన్’ అపన్నహస్తంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ, దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సైతం పరిష్కరిస్తూ నిజమైన ‘అపన్నహస్తం’గా మారుతోంది. సమాజంలో అట్టడుగున ఉన్న ఆదివాసి గిరిజన రైతులకు, పోడు భూములపై ఆధారపడి బతుకుతున్న అన్నదాతలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో కమిషన్ చూపిన చొరవ క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
సాధారణంగా బ్యాంకు రుణాల కోసం తిరిగే పోడు రైతులకు గతంలో చేదు అనుభవాలే ఎదురయ్యేవి. పోడు పట్టా ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు, నిబంధనల సాకుతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడేవి. ఈ విషయాన్ని ఆదివాసి, గిరిజనులు రైతు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 2లక్షల 30వేల మంది రైతులకు చెందిన 6లక్షల 70 వేల ఎకరాలు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద పట్టాలు ఉన్నప్పటికీ ఆయా భూముల వివరాలు భూ భారతి పోర్టల్ లో కనిపించ లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో కూడా చేర్చకపోవడం వల్ల గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటరుణాలు కూడా పొందలేకపోయారు. ఈ విషయాలన్ని గతేడాది చివర్లో కమిషన్ దృష్టికి వచ్చింది.
దీనితో రైతు కమిషన్ సీరియస్ గా తీసుకొని.. కమిషన్ కార్యాలయంలో గిరిజన రైతుల సమస్యలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC)తో, రెవెన్యూ, ఐటీడీఏ, ఫారెస్ట్, వ్యవసాయ శాఖ అధికారులతోపాటు గిరిజన రైతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వానికి రైతు కమిషన్ నివేదికను అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన రైతులు పడ్తున్న ఇబ్బందులు వివరించింది. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడు పట్టాలు ఉన్నప్పటికీ.. భూ భారతి పోర్టల్ లో కనిపించకపోవడం కారణంగా.. పంటరుణాలు రావడం లేదని, బోర్లు వేసుకునే అనుమతులు రాకపోవడం, విద్యుత్ సరఫరా కూడా అందడం లేదని ప్రభుత్వానికి వివరించింది. అంతేకాదు పండిన పంట అమ్ముకునే కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకునే పరిస్థితి లేదని, ఒకవేళ పంట నష్టపోతే.. నష్టపరిహారం కూడా అందకుండా పోతుందనే విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
Also read: Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ వినోదం.. ఒక్కరోజే 10 కి పైగా స్ట్రీమింగ్..!
కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు విన్నపం మేరకు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసి గిరిజన రైతుల భూములను వివరాలు భూ భారతి పోర్టల్ లో చేర్చేలా చూశారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడు భూముల వివరాలు భూ భారతి పోర్టల్ లో కనిపించేలా కొత్త మాడ్యూల్ తీసుకొచ్చారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 30 వేల మందికి మేలు జరిగింది. రైతులకు పంట రుణాలు అందేలా చేసి రికార్డు సృష్టించింది. ‘భూభారతి’ పోర్టల్‌లో లబ్ధిదారుల పూర్తి వివరాలను పొందుపర్చడంతో రైతులకు సంబంధించిన భూమి వివరాలు, వారికి అందిన రుణాల సమాచారం అత్యంత పారదర్శకంగా అందుబాటులోకి వచ్చింది. డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో రైతులకు మరింత సులభంగా సేవలందేలా కమిషన్ పర్యవేక్షిస్తోంది.
ఆదివాసి గిరిజన రైతులకు రైతు కమిషన్ ద్వారా మరో మేలు జరిగింది. రైతులకు రైతు కమిషన్ కొండంత అండగా నిలిచింది. మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం అందించేలా రైతు కమిషన్ కృషి చేసింది.రైతుల పక్షాన నిలబడటంతో దేశంలోనే మొదటి సారిగా మల్టీనేషనల్ విత్తన కంపెనీలు దాదాపు 4 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించేలా చేసింది. దాంతో రైతు కమిషన్ పై మరింత నమ్మకం పెంచుకున్న గిరిజన రైతులు.. మరిన్ని సమస్యలు కమిషన్ దృష్టికి తెచ్చారు.
వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్ అత్యంత కీలకమైన అంశాలు. పాలెంవాగు సాగునీటి ప్రాజెక్టు పరిధిలో రైతులు ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. పాలెం వాగు సాగునీటి ప్రాజెక్టు ద్వారా 10కిలోమీటర్ల వరకు పోడు భూములకు నీటి సరఫరా అందించడానికి త్రీ ఫేజ్ లైన్ లేదు. దీంతో 52 లక్షలు మంజూరు చేయించడంతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 10వేల 132 ఎకరాలకు సాగునీరు అందుతోంది. నిరంతరాయంగా సాగునీరు అందేలా మార్గం సుగమమైంది. మరోవైపు, సుదీర్ఘకాలంగా నలుగుతున్న ఒంటిమామిడి భూవివాదానికి కమిషన్ శాశ్వత పరిష్కారం చూపింది. అక్కడ గిరిజనుల భూమి గిరిజనేతరులపై ఉంది. ఈ వివాదం గత కొన్నేళ్లుగా జరుగుతుంది. ఈ విషయాన్ని కమిషన్ కు వివరించగా, 60 ఎకరాల భూమిని పూర్తి హక్కులతో గిరిజన రైతులకు అప్పగించడంలో కీలక భూమిక పోషించింది. ఆదివాసి గిరిజన రైతులకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నందుకు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also read: భూమికి జానెడు లేరు…గంభీర్ కు మాస్ వార్నింగ్, వైభవ్ క్లాస్ మెట్స్ వీడియో వైరల్
ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలతో రైతు కమిషన్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటోంది. ఎక్కడ రైతుకు సమస్య వచ్చినా, ఏ మూలన అన్యాయం జరిగినా తక్షణమే స్పందిస్తూ సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పనిచేస్తోంది. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ, బ్యాంకులను కదిలిస్తూ.. రాష్ట్ర వ్యవసాయ రంగానికి రైతు కమిషన్ ఒక రక్షక కవచంలా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్తనాలు, ఎరువుల సరఫరా నుంచి మొదలుకొని మద్దతు ధర, భూవివాదాల వరకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తోంది. సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పనిచేస్తూ, రాష్ట్ర రైతాంగానికి నమ్మకమైన దిక్సూచిగా నిలుస్తోంది.
నర్సింహా మూర్తి, రైతు, బర్లగూడెం గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు ఆదివాసి గిరిజన రైతుల కోసం రైతు కమిషన్ కృషి చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం కమిషన్ వేయడం తో రైతుల్లో ఆత్మవిశ్వసం పెరిగింది. మొక్క జొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోతే దాదాపు 4 కోట్లు విత్తన కంపెనీల నుండి ఇప్పించారు. ఇప్పుడు ఆర్వోఎఫ్ ఆర్ కింద ఉన్న భూములు భూ భారతిలో కనిపించేలా మాడ్యూల్ తేవడం తో పంటరుణాలు పొందుతున్నాం. బోర్లు, విద్యుత్ సరఫరా కూడా అందుతోంది.
రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుంది. ఆదివాసి గిరిజనులకు వన్ ఆప్ 70 చట్టంను కాంగ్రెస్ తెచ్చింది. 2006లో ఫారెస్టు ఏరియాలోని రైతులకు భూ హక్కులు కల్పించేందుకు చట్టం తెచ్చింది కాంగ్రెస్సే. కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద భూపట్టాలు ఉన్నప్పటికీ భూ భారతిలో కనిపించకపోవడం, వారికి పంటరుణాలు రావడం లేదని కమిషన్ దృష్టికి రావడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది. మొక్కజొన్న రైతులకు కంపెనీల నుంచి సుమారు 4కోట్ల పరిహారం ఇప్పించాం. పాలెం వాగు సాగునీటి ప్రాజెక్టు రైతులకు త్రీఫేజ్ లైన్, ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టాం.
Also Read: Rural Employment: ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. కనీస వేతనం ఫిక్స్.. తెలంగాణలో కొత్త రేట్లు ఇవే..!