Telangana SIR: స్వేచ్చ బ్యూరో: ఓటరు జాబితాలోని తప్పులను సరి చేసుకోవటంతో పాటు జాబితాలోని బోగస్, రీపిటెడ్, డూప్లికేట్, అనమాలిస్ ఓట్లను ఏరివేసేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది దశకు చేరుకుంది. కానీ కొత్తలో చాలా స్లోగా సాగిన సర్ ప్రక్రియలో ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకోవటంతో పాటు పలు చోట్ల బీఎల్ఏలు మరో వర్గానికి చెందిన ఓట్లు తొలగించాలని ఫారం-7 ను సమర్పించటం వివాదాస్పదంగా మారుతుండగా, మరి కొన్ని చోట్ల రాజకీయ పార్టీల ప్రతినిధులుగా సర్ ప్రక్రియలో భాగస్వాములైన బీఎల్ఏలపై కేసులు కూడా నమోదవుతున్నాయి. రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పోటాపోటీన ఫారం-7 లను సమర్పించటం ఎన్నికల విభాగం అధికారులకు తలభారంగా మారుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92 లక్షల 88 వేల 180 నోటీసులు జారీ చేయగా, వాటిలో దాదాపు 91 లక్షల 91 వేల 625 మంది అనామలిస్, రిపీటెడ్, డూప్లికేట్, రీపిటెడ్, సర్ 2002 సమాచారమివ్వని ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇంకా దాదాపు 95 వేల 555 మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన మొత్తం 91 లక్షల 91 వేల 625 మంది ఓటర్లలో దాదాపు 71 లక్షల 23 వేల 526 మంది ఓటర్లు హియరింగ్ లకు హాజరై ఎన్నికల విభాగం అధికారులకు తగిన డాక్యుమెంట్లు, వారు సంతృప్తి చెందేలా సమాధానమివ్వటంతో తుది జాబితాలో తమ వివరాలను ప్రచురించేందుకు అర్హతను సాధించుకున్నట్లు కూడా ఎన్నికల సంఘం తెలిపింది. వచ్చే నెల 5వ తేదీ వరకు నోటీసులు జారీ చేసిన ఓటర్లందరికీ హియరింగ్ లు నిర్వహించి, వచ్చే నెల 9వ తేదీన ఎన్నికల సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారీగా ఓటరు తుది జాబితాను విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఓటు కోసం 4 లక్షల 88 వేల 417 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో అభ్యంతరాలు, క్లుయిమ్‌ల గడువు బుధవారంతో ముగిసింది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన అభ్యంతరాలు, క్లెయిమ్స్ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు అందినట్లు తెలిపింది. జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫారం-6 ( కొత్తగా నమోదు), ఫారం-6ఏ (విదేశాల్లో నివసించే వారికి ఓటు కల్పించటం), ఫారం-7 ( ఓటరు వివరాలు తొలగింపు), ఫారం-8( ఒక చోట నుంచి మరో చోటుకు ఓటు బదిలీ) దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారానికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది.
Also read: మీ పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారా.. భయపడకుండా ఇలా చేయండి?
అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఫారం-6 కింద కొత్త ఓటర్ల నమోదు కోసం 4 లక్షల 88 వేల 417 దరఖాస్తులు అందగా, వాటిలో 51 వేల 821 దరఖాస్తులను ఇప్పటికే ఓటరు జాబితాలో చేర్చినట్లు సమాచారం. విదేశాల్లో నివసించే భారతీయ ఓటర్లకు సంబంధించిన ఫారం-6ఏ కింద 6 వేల 270 దరఖాస్తులు అందగా, వాటిలో 118 దరఖాస్తులు పరిష్కరించారు. ఓటరు పేర్ల తొలగింపునకు సంబంధించిన ఫారం-7 కింద 24 వేల 323 దరఖాస్తులు అందగా, వాటిలో 12 వేల 204 పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. వివరాల సవరణ, చిరునామా మార్పులు తదితర అంశాలకు సంబంధించిన ఫారం-8 కింద అత్యధికంగా 5 లక్షల 5 వేల 159 దరఖాస్తులు అందగా, వాటిలో 2 లక్షల 27 వేల 721 దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఫారం-6 కింద 194,204 దరఖాస్తులు నమోదయ్యాయి. అనంతరం రంగారెడ్డి జిల్లాలో 74 వేల 375, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 64 వేల 863 దరఖాస్తులు అందాయి. నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గణనీయ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
మరోవైపు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల వంటి జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య తక్కువగా నమోదైంది. ఫారం-8 కింద హైదరాబాద్ జిల్లా లక్షా 44 వేల 800 దరఖాస్తులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 65 వేల 414, రంగారెడ్డి జిల్లాలో 68 వేల 2 దరఖాస్తులు అందాయి. ఫారం-7 ద్వారా ఓటరు పేర్ల తొలగింపునకు సంబంధించి అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 6 వేల 335 దరఖాస్తులు నమోదు కాగా, రంగారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కూడా గణనీయ సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విడుదల చేసిన వివరాల ప్రకారం నిజామాబాద్ అర్బన్, రామగుండం, మంచిర్యాల, మంథని, సిర్పూర్, ఆసిఫాబాద్ తదితర నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా నమోదయ్యాయి. స్వీకరించిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా కొనసాగిస్తూ అర్హులైన వారి వివరాలను ఓటరు జాబితాలో చేర్చడం, అవసరమైన మార్పులు చేయడం, అనర్హుల పేర్ల తొలగింపు ప్రక్రియను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నట్లు కూడా ఎన్నికల సంఘం తెలిపింది.
Also read: హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2