Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారికి తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఇసుక కొరత తీర్చడానికి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కొత్తగా నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది. దీంతో ఇల్లు కట్టుకునేవారికి ఇసుక సమస్య తీరనుంది.
తెలంగాణతోపాటు ఏపీలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు మొదలయ్యాయి. దీంతో ఇసుక విషయంలో కొరత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. తెలంగాణలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ. రంగారెడ్డి జిల్లాలో వట్టి నాగులపల్లి, అబ్దుల్లాపూర్ మెట్, ఆదిభట్ట, మేడ్చల్ జిల్లాలో భౌరంపేటలో ఉన్నాయి. ఆ నాలుగు ప్రాంతాల్లో ఇసుక బజార్లు అందుబాటులో ఉన్నాయి.
ఆయా బజార్లలో సన్న ఇసుకను టన్ను రూ. 1800 ఉంది. అదే దొడ్డు ఇసుకను రూ. 1600కు విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అన్ని ఇసుక బజార్లలో నాణ్యమైన.. నది ఇసుక నిల్వలు ఉన్నాయని పేర్కొంది. వ్యక్తిగత వినియోగదారులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల అవసరాలను తీర్చగలిగేలా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
ALSO READ: కబ్జా అవుతున్నా మౌనం ఎందుకు? తెలంగాణ బీజేపీ చీఫ్‌కి కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్ సిటీలో ఇసుక సమస్య నిర్మాణ రంగానికి పెద్ద సమస్యగా మారింది. ఇసుక సరఫరాలో ఆలస్యం, దీనికితోడు అధిక ధరలు తోడయ్యాయి. అక్రమ రవాణా సమస్యల కారణంగా పలు ప్రాజెక్టులు డిలే అవుతున్నాయి. నిర్మాణ వ్యయం పెరగడంతో వినియోగదారులపై భారం తీవ్రమైంది.
సిటీకి ప్రధానంగా ఇసుక కృష్ణా, గోదావరి నదుల రీచ్‌ల నుంచి వస్తోంది. దీనికితోడు వర్షాకాలంలో రీచ్‌లలో తవ్వకాలు నిలిచిపోవడం కొరతకు మరో కారణం. ఈ క్రమంలో ఇసుక బజార్ల ఏర్పాటు నిర్మాణ రంగానికి సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. వినియోగదారులు ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
ttps://sand.telangana.gov.in/TGSandBazaarPortal/Masters/Home.aspx. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం TSMDC హెల్ప్‌లైన్ నంబర్ 155242ను సంప్రదించవచ్చు. లేకుంటే mdcltd@telangana.gov.in ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.