Indian Railway Food: రైలు ప్రయాణం అనగానే చాలామందికి వేడి టీ, సమోసా, బిర్యానీ, ప్యాంట్రీలో లభించే భోజనం గుర్తుకొస్తాయి. కానీ, గత కొంత కాలంగా రైళ్లలో అందించే ఆహారంపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రుచి సరిగ్గా లేకపోవడం, ఫుడ్ క్వాలిటీ సరిగా లేకపోవడం, పరిశుభ్రత సమస్యలు లాంటి కారణాలతో కొందరు ప్రయాణికులు ప్యాంట్రీ ఫుడ్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. అయితే, దీనికి ఒక్క కారణమే కాదు. ఫుడ్ తయారీ నుంచి నిల్వ, రైల్లో వేడి చేయడం, ప్రయాణికుల ఆప్షన్స్ వరకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి.
ప్రయాణంలో అలసట, పరిసరాల్లోని శబ్దం లాంటి అంశాలు ఫుడ్ మనం తీసుకునే విధానం మీద ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. విమాన ప్రయాణాలతో పోలిస్తే రైళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ, ప్రయాణ సమయంలో ఆహారం ఇంట్లో తిన్నంత రుచిగా అనిపించకపోవచ్చు. దీంతో సాధారణంగా రుచిగా ఉండే ఆహారం కూడా ప్రయాణంలో కొంత చప్పగా అనిపించే అవకాశం ఉంటుంది.
ప్రయాణికులు అనుకునే విధంగా ప్రతి రైలులోనూ ఫుడ్ పూర్తిగా అక్కడికక్కడే తయారవుతుందని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో బేస్ కిచెన్లలో ముందుగానే తయారు చేసిన ఆహారాన్ని రైలుకు సరఫరా చేస్తారు. ఆహారం తయారైన తర్వాత కొంత సమయం నిల్వ ఉండటం, ఆ తర్వాత మళ్లీ వేడి చేయడం వల్ల రుచి, తాజాదనం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్నం, కూరలు, గ్రేవీలో ఈ మార్పు స్పష్టంగా కనిపించవచ్చు.
ఫుడ్ రేట్లను అందుబాటులో ఉంచడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు సరఫరా చేయాల్సి ఉండటం క్యాటరింగ్ వ్యవస్థకు పెద్ద సవాలు. ఫుడ్ క్వాలిటీ, వంట విధానం, నిల్వ చేసే ఉష్ణోగ్రత, పరిశుభ్రత లాంటి అంశాల్లో తగిన ప్రమాణాలు పాటించకపోతే రుచి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణికులు రుచి మాత్రమే కాకుండా ఆహారం ఎంత సేఫ్ గా తయారైందనే విషయాన్ని కూడా గమనిస్తున్నారు.
రైల్లో వంట చేయడం, ఫుడ్ నిల్వ చేయడం కోసం పరిమిత స్థలం మాత్రమే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పరిశుభ్రతను నిరంతరం పాటించడం చాలా ముఖ్యం. ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోవడం, పరికరాలను సక్రమంగా శుభ్రం చేయకపోవడం వంటి సమస్యలు ఉంటే ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో కనిపించడం వల్ల ప్రయాణికుల్లో మరింత అనుమానం పెరుగుతోంది.
రైలు భోజన విక్రయాలు తగ్గడానికి మరో కారణం ప్రయాణికులకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు. IRCTC ఇ-క్యాటరింగ్ ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన స్టేషన్ నుంచి ఆహారాన్ని ముందుగా ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ డెలివరీ సేవలు పెరగడంతో ప్రయాణికులు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి భోజనం తెప్పించుకునే అవకాశం ఉంది. కొందరు ఇంటి నుంచే భోజనం లేదా డ్రై ఫుడ్ తీసుకువస్తున్నారు. సో, రైల్వే క్యాటరింగ్‌పై ప్రయాణికుల నమ్మకం పెరగాలంటే పుడ్ టేస్టీ మాత్రమే కాకుండా క్వాలిటీ, పరిశుభ్రత, నిల్వ విధానం, ధర లాంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
Read Also: IRCTC మొదలైంది అప్పుడే.. ఆ రోజు ఎన్ని టికెట్లు ఆన్‌లైన్లో బుక్ అయ్యాయో తెలుసా?