Indian Railways: భారతీయ రైల్వే ప్రతి ఏటా పండుగ సందర్భంగా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా దుర్గా పూజ, దీపావళి, ఛత్ పూజ సమయంలో ప్రయాణీకుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన చర్యలు చేపడుతోంది. పెరిగిన రష్ కు అనుగుణంగా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి అదనపు సేవలను ప్లాన్ చేసింది. ఇప్పటికే పండుగ సీజన్ లో మొత్తం 12,000 రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. నిర్దిష్ట మార్గాల్లో నడిపే రైళ్లకు సంబంధించిన వివరాలను ఇప్పటికే జారీ చేస్తోంది.
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 48 ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా 48 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు మొత్తం 684 ట్రిప్పులు వేయనుంది. తూర్పు మధ్య రైల్వే బీహార్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం 14 రైళ్లను నడుపుతుంది. పాట్నా, గయ, దర్భంగా, ముజఫర్‌పూర్‌లను కలుపుతుంది, మొత్తం 588 ట్రిప్పులు. తూర్పు రైల్వే కోల్ కతా, హౌరా, సీల్దా నుంచి 24 రైళ్లను నడుపుతుంది. ఇవి మొత్తంగా 198 ట్రిప్పులను అందించనున్నాయి. పశ్చిమ రైల్వే ముంబై, సూరత్, వడోదర మార్గాలకు సేవలు అందించేలా మరో 24 రైళ్లను నడుపుతుంది. ఇవి 204 ట్రిప్పులను అందించనున్నాయి. దక్షిణ రైల్వే చెన్నై, కోయంబత్తూర్, మధురై మార్గాలలో 10 రైళ్లను నడుపుతుంది. ఇవి 66 ట్రిప్పులను వేయనున్నాయి.
తొలి విడుతలో భాగంగా 150 రైళ్లు
అటు వీటితో పాటు, భువనేశ్వర్, పూరి, సంబల్పూర్, రాంచీ, టాటానగర్, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, బిలాస్ పూర్, రాయ్ పూర్, భోపాల్, కోట నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతామని భారతీయ రైల్వే ప్రకటించింది. తొలి విడుతలో భాగంగా ఈ రైళ్లను ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణీకుల డిమాండ్‌ను బట్టి మరిన్ని రైళ్లను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
Read Also: రైలు పట్టాల మీదే కరెంటు తయారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలన్న అధికారులు
ప్రయాణ సమయంలో ఇబ్బంది లేకుండా ముందుగానే కన్ఫార్మ్ టికెట్లను పొందడానికి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణీకులకు సూచించారు. ప్రయాణికులు తమ ప్రయాణాల సమయంలో అన్ని భద్రత, పరిశుభ్రత మార్గదర్శకాలను పాటించాలన్నారు. పండుగ సీజన్ లో దేశ వ్యాప్తంగా ప్రయాణికులకు సజావుగా ప్రయాణం ఉండేలా చూడటం, దుర్గా పూజ, దీపావళి, ఛత్ పండుగలను ప్రజలు తమ కుటుంబాలతో జరుపుకునేలా చేయడం కోసం ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు. మెట్రో ప్రాంతాల నుంచి చిన్న పట్టణాల వరకు ప్రత్యేక కనెక్టివిటీతో, వేలాది మంది పండుగ ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Read Also: 55 రైళ్లు రద్దు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం, కారణం ఏంటంటే!