Duvvada Railway Station: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సేవలను అన్ని ప్రాంతాల ప్రజలు వినియోగించుకునేలా రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని.. తూర్పు తీర రైల్వే జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్ కోరారు. ఈ ప్రాంతంలో రైల్వే సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా వాల్తేరు రైల్వే డివిజన్ కు ఆయన కీలకమైన సూచనలు చేశారు. అందులో భాగంగానే దువ్వాడ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ అవకాశం కల్పించాలని కోరారు.
దువ్వాడలో ఆపాల్సిన వందేభారత్ రైళ్లు!
దువ్వాడ రైల్వే స్టేషన్ మీదుగా ప్రస్తుతం విశాఖపట్నం-సికింద్రాబాద్(20833/20834), సికింద్రాబాద్-విశాఖపట్నం(20707/20708) రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లను ఆపడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు వందేభారత్ సేవలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడి నుంచి పలువురు ప్రయాణీకులు ప్రతి రోజూ విశాఖపట్నంతో పాటు సికింద్రాబాద్ కు వెళ్తారని, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో ఇతర రైళ్లను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. అటు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి విశాఖపట్నం నుంచి బెంగళూరుకు తిరుపతి, చెన్నై మీదుగా నడిచే వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లను ప్రవేశపెట్టాలని ఈశ్వరన్ ప్రతిపాదించారు.
వీక్లీ సర్వీసులు.. డైలీ సర్వీసులుగా..
అటు విశాఖపట్నం-కొల్లం, విశాఖపట్నం-షిర్డి, విశాఖపట్నం-గాంధీ ధామ్, విశాఖపట్నం-వారణాసి, విశాఖపట్నం-చెన్నై సహా పలు మార్గాల్లో నడుస్తున్న వీక్లీ సర్వీసులను రోజువారీ కార్యకలాపాలకు మార్చాలని ఈశ్వరన్ కోరారు. అదే సమయంలో సుదూర రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని ప్రతిపాదించారు. మరోవైపు ప్రస్తుతం 11 కోచ్ లతో నడుస్తున్న విశాఖపట్నం-తిరుపతి(22707) రైలుకు సమ్మర్ నేపథ్యంలో తాత్కాలికంగా కోచ్ ల సంఖ్యను పెంచాలని కోరారు. పీక్ సీజన్లలో పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్ ను తీర్చడానికి థర్డ్ ఎసీ, లేదంటే సెకండ్ ఎసీ కోచ్‌లను జోడించాలన్నారు.
దువ్వాడ స్టేషన్ లో వసతులను పెంచాలని సూచన
అటు దువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ప్రయాణీకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రయాణీకుల సౌకర్యాలు లేవని ఈశ్వరన్ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు వెంటనే ఈ స్టేషన్ ను సందర్శించిచి అవసరమైన అభివృద్ధి పనులను అంచనా వేయాలని సూచించారు. వీలైతే స్టేషన్ మరింతగా ఆధునీకరించాలని డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం), ఇతర అధికారులకు సూచించారు.
Read Also: వామ్మో, సికింద్రాబాద్.. విశాఖ వందే భారత్ లో కూడా జ్యోతి రెక్కీ? ఇదిగో వీడియో!
రోజూ 20 వేల మంది రాకపోకలు
దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి రోజూ సుమారు 20 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. స్పెషల్ డేస్, వీకెండ్స్ లో ఈ సంఖ్య మరో 5 వేలకు పెరుగుతుంది. రోజూ ఈ మార్గంలో 75కు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. ఇప్పటికే ఈ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి కాబోతోంది. ఇక్కడ వందేభారత్ రైళ్లు కూడా హాల్టింగ్ ఇస్తే, ప్రయాణీకులకు మరింత లాభం కలగడంతో పాటు రైల్వేకు ఆదాయం పెరగనుంది.
Read Also: విజయవాడ-బెంగళూరు రూట్ లో వందేభారత్, ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!