Secunderabad to Ayodhya and Kashi Yatra: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే ప్రయాణంలో దర్శించాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి రెండు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ యాత్రల్లో ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలతో పాటు దక్షిణ భారతంలోని ప్రముఖ దేవాలయాలను కూడా సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
మొదటి ప్యాకేజీలో అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, పూరీ, కోణార్క్, డియోఘర్ లాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను సందర్శించేలా టూర్ ను రూపొందించారు. శ్రీరామ జన్మభూమి, కాశీ విశ్వనాథ ఆలయం, త్రివేణి సంగమం, జగన్నాథ ఆలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఈ యాత్రలో దర్శించవచ్చు. భక్తులకు ఒకే ప్యాకేజీలో పలు ప్రసిద్ధ క్షేత్రాలను చూసే అవకాశం లభిస్తుంది.
రెండో ప్యాకేజీ దక్షిణ భారతంలోని ముఖ్యమైన దేవాలయాలను కవర్ చేస్తుంది. దివ్య దక్షిణ యాత్ర పేరుతో నిర్వహించే ఈ టూర్ లో పలు ప్రసిద్ధ ఆలయాలను సందర్శించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి ఈ ప్యాకేజీ అనుకూలంగా ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే CPRO ఎ. శ్రీధర్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రయాణికులు రైలెక్కిన క్షణం నుంచి తిరిగి సికింద్రాబాద్ చేరుకునే వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఐఆర్‌సిటీసీ చూసుకుంటుందన్నారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్రను పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. ఈ టూర్ ప్యాకేజీల్లో రైలు ప్రయాణం, వసతి, భోజనం, స్థానిక రవాణా, దర్శన ఏర్పాట్లు, రైలులో అవసరమైన సేవలు, సదుపాయాలు ఉంటాయన్నారు. ప్రయాణికులు విడివిడిగా బుకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే ప్యాకేజీలో అన్ని సౌకర్యాలను పొందే అవకాశం ఉందన్నారు.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభించబడ్డాయి. తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కుటుంబాలతో కలిసి వెళ్లే భక్తులకు ఈ ప్యాకేజీలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ ప్రత్యేక యాత్రలకు సంబంధించి పూర్తి వివరాలు, ప్రయాణ తేదీలు, ఛార్జీలు, బుకింగ్ విధానంలాంటి పూర్తి సమాచారం ఐఆర్‌సిటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్న నేపథ్యంలో ఆసక్తి ఉన్న భక్తులు ముందుగానే ప్యాకేజీ తీసుకోవడం మంచిదన్నారు.
Read Also: వందే భారత్ డోర్లు క్లోజ్ అయినా నో టెన్షన్.. ఇలా చేస్తే హ్యాపీగా రైలు ఎక్కొచ్చు!