Hyderabda Niloufer Café: హైదరాబాద్ కు నీలోఫర్ ఛాయ్ కి విడదీయలేని అనుబంధం ఉంది. భాగ్యనగరంలో ఛార్మినార్, బిర్యానీ, హలీమ్ కు ఎంత ఫేమస్సో, ఛాయ్ కి ఐకానిక్ నీలోఫర్ కేఫ్ అంత ఫేమస్. హైదరాబాద్ లో ఉండే ఛాయ్ ప్రియులు కనీసం ఒక్కసారైనా రుచి చూసే ఉంటారు. దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజలకు మైమరచిపోయే ఛాయ్ ని అందిస్తూ ఫిదా చేస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో నీలోఫర్ అవుట్ లెట్లు అందుబాటులోకి వచ్చాయి. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సైతం తన అద్భుతమైన రుచితో మైమరచిపోయేలా చేస్తోంది. హైదరాబాద్ నగరంలో త్వరలో మరో అవుట్ లెట్ ఓపెన్ కాబోతోంది. ఈ సందర్భంగా ఛాయ్ లవర్స్ కు క్రేజీ ఆఫర్ ప్రకటించింది.
ఈ నెల 20న నీలోఫర్ ఛాయ్ ఫ్రీ
ఈ నెల 20న రాయదుర్గం మైండ్ స్పేస్ ప్రాంతంలో కొత్త నీలోఫర్ కేఫ్ అందుబాటులోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఫ్రీ ఛాయ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఆ రోజంతా ఎంత మంది వచ్చినా ఉచితంగా ఛాయ్ అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. చుట్టూ సాఫ్ట్ వేర్ కంపెనీలు, ప్రతిష్టాత్మక సంస్థలు నెలకొన్న ఈ ప్రైమ్ ఏరియాలో నీలోఫర్ కేఫ్ ప్రారంభం కావడం పట్ల ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రుచి, నాణ్యతలో రాజీ లేని నీలోఫర్ కేఫ్ తమకు సమీపంలోకి రావడం పట్ల ఛాయ్ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
నీలోఫర్ కేఫ్ గురించి..
నీలోఫర్ కేఫ్ ను 1978లో ఎ. బాబు రావు స్థాపించారు. అప్పటి నుంచి ఛాయ్ లవర్స్ ను తన మధురమైన రుచితో కట్టిపడేస్తుంది. నెమ్మదిగా ఈ కేఫ్ ఔట్ లెట్ లు హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరించాయి. ప్రజలకు ఇష్టమైన ఛాయ్ స్పాట్‌లు మారిపోయాయి. ఇక్కడ అందించే క్రీమీ టీ రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మెత్తటి, తేలికైన తీపి,ఉప్పు కలబోతగా ఉండే ఉస్మానియా బిస్కెట్ ను ఛాయ్ లో ముంచుకుని తింటే, ఎవ్వరైనా ఆహా అనాల్సిందే. ఛాయ్, ఉస్మానియా బిస్కెట్ మాత్రమే కాదు, ఎన్నో రకాల బేకరీ ఫుడ్స్ కూడా ఇందులో లభిస్తాయి. కుకీలు, చాక్లెట్లు, టీ పౌడర్లు, పేస్ట్రీలు, పఫ్‌లు, కేకులు సహా మరెన్నో తినుబండారాలను అందిస్తుంది. బన్ మస్కా ఇక్కడ మరింత స్పెషల్. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఆకట్టుకునే ఎన్నో తినుబండారాలు నీలోఫర్ కేఫ్ లో లభిస్తాయి.
Read Also: హైదరాబాద్ లో ఉచిత ఉబెర్ షటిల్ సర్వీసులు, ఏ రూట్లలో నడుస్తాయంటే?
బాబురావు జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం
నీలోఫర్ కేఫ్ యజమాని బాబురావు జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు చాయ్ కేఫ్ లో కప్పులు కడిగిన ఆయన, ఇప్పుడు నీలోఫర్ కేఫ్ లకు యజమానిగా ఎదిగాడు. దీని వెనుక ఆయన ఏండ్ల కష్టం ఉంది. పట్టుదలతో పని చేస్తే ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేదానికి నీలోఫర్ కేఫ్ యజమాని బాబురావు ప్రత్యక్ష ఉదాహారణగా చెప్పుకోవచ్చు.
Read Also: కాశ్మీర్ అందాలు చూడాలనుందా? తక్కువ ధరలో స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC!