Coal Waste to Strong Roads: బొగ్గు గనుల్లో పేరుకుపోయే వ్యర్థాలు సాధారణంగా పర్యావరణానికి సమస్యగా మారుతుంటాయి. అయితే, ఈ వ్యర్థాలను ఉపయోగించి బలమైన రోడ్ల నిర్మాణానికి పనికొచ్చే కొత్త పదార్థాన్ని ఎన్ఐటీ రూర్కెలా పరిశోధకులు తయారు చేశారు. అంతేకాదు, ఈ టెక్నాలజీకి పేటెంట్ కూడా తీసుకున్నారు. భారీ వాహనాల రాకపోకలను తట్టుకునే రోడ్ల నిర్మాణంలో ఈ పదార్థాన్ని ఉపయోగించవచ్చని చెప్తున్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలాకు చెందిన మైనింగ్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధకులు ఈ కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ కె. ఉమామహేశ్వర రావు, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ మిశ్రా, పీహెచ్‌డీ స్కాలర్ డాక్టర్ సుభాశ్రిత చౌదరి ఈ పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. బొగ్గు గనుల నుంచి వచ్చే వ్యర్థాలు, ఫ్లై యాష్ తో పాటు ప్రత్యేక బైండర్ ను కలిపి ఈ పదార్థాన్ని తయారు చేశారు. అవసరమైన బలం, దృఢత్వం వచ్చేలా మిశ్రమం నిష్పత్తులను పరిశోధకులు మార్చుతూ ప్రయోగాలు చేశారు.
భారత్‌లో ప్రతి సంవత్సరం దాదాపు ఒక బిలియన్ టన్నుల ముడి బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇందులో ఎక్కువ భాగం ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా తీస్తారు. ఈ ప్రక్రియలో బొగ్గుతో పాటు రాళ్లు, మట్టి, ఇతర పదార్థాలు కూడా బయటకు వస్తాయి. భారీ మొత్తంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను నిల్వ చేయడం, పారవేయడం పెద్ద సమస్యగా మారుతోంది. భూమి, నీరు, గాలిపై ప్రభావం పడుతోంది.
బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బొగ్గు, ముడి పదార్థాలను తరలించే ట్రక్కులు నిరంతరం రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. దీంతో సాధారణ రోడ్లు త్వరగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అయితే, ఎన్ఐటీ రూర్కెలా అభివృద్ధి చేసిన కొత్త పదార్థం ఇలాంటి ప్రాంతాల్లో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువ బరువును తట్టుకునే సామర్థ్యం ఉండటంతో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే రోడ్ల నిర్మాణంలో దీనిని వినియోగించే అవకాశం ఉంది.
బొగ్గు గనుల వ్యర్థాల్లో సిలికా, అల్యూమినా అధికంగా ఉండే కొన్ని బంకమట్టి ఖనిజాలు ఉంటాయి. ఇవి సరైన విధంగా ప్రాసెస్ చేసి ఇతర పదార్థాలతో కలిపితే నిర్మాణ అవసరాలకు ఉపయోగపడేలా తయారవుతుంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని బొగ్గు వ్యర్థాలు, ఫ్లై యాష్, బైండర్ తో కొత్త మిశ్రమాన్ని తయారు చేశారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఇది సర్క్యులర్ ఎకానమీకి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే, వ్యర్థంగా భావించే పదార్థాలను తిరిగి ఉపయోగించి కొత్త ఉత్పత్తులుగా మార్చడం. ప్రయోగశాల స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ పదార్థాన్ని వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించేందుకు పరిశోధకులు సిద్ధమవుతున్నారు. ఎక్కువ కాలం పాటు భారీ వాహనాల రాకపోకలను తట్టుకుంటుందా? వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటుంది? లాంటి అంశాలను తెలుసుకోనున్నారు.
Read Also: నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!