విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు విమానం బయల్దేరే సమయాని కంటే సుమారు 2 నుంచి 3 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. చెకింగ్ క్లియర్ చేసుకుని లాంజ్ లో వెయిట్ చేస్తారు. ఏమాత్రం ఆలస్యం అయినా విమానం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తప్పుడు నిర్బంధం కారణంగా విమానం తప్పిపోయిన భారత సంతతికి చెందిన యూకే పౌరుడికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాలని కర్ణాటక మానవ హక్కుల కమిషన్ బెంగళూరు పోలీసు అధికారిని ఆదేశించింది.
వాస్తవానికి ఈ ఘటన ఫిబ్రవరి 19, 2019లో జరిగింది. బ్రిటిష్ జాతీయుడు కృష్ణ ప్రసాద్ ఉదయం ముంబై విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ తర్వాత లండన్ విమానం ఎక్కడానికి రెడీ అయ్యాడు. బెంగళూరు పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసుపై అతడిని ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2016 అతడిపై బెదిరింపులకు సంబంధించి కిమినల్ కేసులో లుకౌట్ నోటీసు జారీ అయ్యింది. అయితే, ప్రసాద్ 2018లో కర్ణాటక హైకోర్టు నుంచి స్టే తీసుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, అతడిని విమానం ఎక్కడానికి అనుమతించలేదు. అదే రోజు, మధ్యాహ్నం 12:04 గంటలకు హలసురు గేట్ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ప్రసాద్ ను అరెస్టు చేయాలని ఒక ఇమెయిల్ వచ్చింది. ఫిబ్రవరి 20 సాయంత్రం వరకు అతడిని నిర్బంధంలో ఉంచారు. తర్వాత హలసురు గేట్ మహిళా స్టేషన్ నుంచి ఇద్దరు పోలీసు సిబ్బంది ముంబై చేరుకున్నారు. విచారణ తర్వాత యూకే పౌరుడు విడుదలయ్యాడు.
Read Also: భారత్, పాక్ ప్రధాన మంత్రులు ప్రయాణించే విమానాల్లో ఇన్ని తేడాలా? ఏ విమానం గొప్ప?
ఈ ఘటనపై యూకే పౌరుడు ప్రసాద్ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా, కమిషన్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. హలసురు గేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శైలజ దర్యాప్తు సమయంలో సంఘటన జరిగిన రోజు తాను స్టేషన్ లో లేనని, ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి పంపిన ఇమెయిల్ గురించి తనకు తెలియదని వెల్లడించారు. తన ముందున్న ఆఫీసర్ సమయంలో లుకౌట్ నోటీసు జారీ చేయబడిందని తెలిపారు. అయితే, కర్ణాటక హైకోర్టు స్టే ఆర్డర్ ను పోలీస్ స్టేషన్‌కు పంపారని, శైలజ ఇద్దరు పోలీసు అధికారులను ముంబైకి వెళ్లాలని ఆదేశించారని కమిషన్ గుర్తించింది. ప్రసాద్ నిర్బంధించడం, అతడె ఫ్లైట్ మిస్ కావడం వల్ల రూ. 57,000 విమాన టికెట్ నష్టపోవడానికి కారణం పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని మానవ హక్కుల ప్యానెల్ తేల్చింది. సదరు వ్యక్తికి రూ. 2 లక్షలు పరిహారంగా చెల్లించాలని, దానిని శైలజ జీతం నుంచి తీసుకోవాలని కమిషన్ తీర్పు వెల్లడించింది. ఆమెపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని కూడా ఆదేశించింది.
Read Also: డిసెంబర్‌లో కేరళ, కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లాలా? అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ!