Ram Mohan Naidu: దేశంలో పర్యాటక రంగానికి మరింత బూస్టింగ్ ఇచ్చేలా కేంద్ర విమానయానశాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే పలు ప్రాంతాల్లో సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అక్టోబర్ నాటికి దేశ వ్యాప్తంగా రెండు మార్గాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌర విమానయాన రంగంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
అక్టోబర్ నాటికి రెండు మార్గాల్లో సీప్లేన్ సేవలు
తాజాగా భువనేశ్వర్ లో తూర్పు ప్రాంత పౌర విమానయాన మంత్రుల సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు కీలక విషయాలు వెల్లడించారు. సీప్లేన్ సేవలు గతంలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత అవి తగ్గిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఒకే మార్గంలో నడుస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ విమానాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం మార్గదర్శకాలను సులభతరం చేసినట్లు వివరించారు. అక్టోబర్ నాటికి అండమాన్- నికోబార్, కేరళ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో రెండు సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఒడిశాలోని చిలికా సరస్సుతో పాటు తూర్పు తీరమంతా ఈ సేవలను విస్తరించే అవకాశం ఉందన్నారు.
నిబంధనలు మరింత సులభతరం
సీప్లేన్ సేవల కొనసాగాలంటే 5 అడుగులకు పైగా లోతు, 200 మీటర్ల ల్యాండింగ్ స్థలం ఉన్న ఏ జలాశయం అయినా అనుకూలంగా ఉంటుందన్నారు రామ్మోహన్ నాయుడు. ఈ సేవలకు అవసరమైన వాటర్ డ్రోమ్(విమానం దిగేందుకు నీటిలో ఏర్పాటు చేసే రన్ వే) ఏర్పాటు, పైలట్లకు శిక్షణ, ఇతర నిబంధనలను సులభతరం చేసినట్లు వెల్లడించారు.
సీప్లేన్ సేవలపై దృష్టిసారించాలని సూచన
అటు ఈ సదస్సులో పాల్గొన్న విమానయాన సంస్థలకు రామ్మోహన్ నాయుడు కీలక సూచన చేశారు. సీప్లేన్ సేవలకు దేశంలో మంచి డిమాండ్ ఉన్న ఆయన.. ఆయా సంస్థలు ఈ సర్వీసులను నడిపే దిశగా ఆలోచించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయ సాకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎయిర్ లైన్స్ ఆపరేటర్లను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సీప్లేన్ నెట్ వర్క్ ను విస్తరించేందుకు కలిసి రావాలన్నారు.
Read Also: కళ్లు చెదిరేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. నమ్మకపోతే ఈ వీడియో చూడండి!
ఏడాదికి 3 వేల మంది పైలెట్లు అవసరం
అటు విమానయాన రంగంలో పైలట్ల శిక్షణ సంస్థలకు డిమాండ్ భారీగా పెరుగుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రతి ఏటా 3 వేల మంది పైలెట్ల అవసరం ఉందన్నారు. “ప్రస్తుతం 1,700 విమానాలకు ఆర్డర్లు వచ్చాయి. ఒక్కో విమానానికి 20 నుంచి 30 మంది పైలట్లు అవసరం. దేశంలోనే ఈ డిమాండ్‌ను తీర్చాలంటే ప్రతి సంవత్సరం 3,000 మంది పైలట్లను తయారు చేయాలి” అన్నారు. పౌర విమానయాన రంగంలో భారత్‌ను ప్రపంచ స్థాయి అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు డైవర్ట్, కారణం ఏంటంటే?