Drugs: డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ యువకుడు హైదరాబాద్‌లో మృతి చెందాడు. అహ్మద్ అలీ అనే యువకుడు అతని స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు కలిసి శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్లో కొంతకాలంగా ఉంటున్నారు. గత రాత్రి అలీతో పాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నారు. ఈ పార్టీ లో అహ్మద్ అలీ అధికంగా డ్రగ్స్ వాడడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అధికంగా డ్రగ్స్ తీసుకోవడం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.