Indonesia Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూ.. పెద్దగా పరిచయం అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ లో సంయుక్తంగా ఈ సర్వీసును అందిస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రోడ్లు, ప్రదేశాలు, నగరాలను 360-డిగ్రీ పనోరమిక్ చిత్రాలలో చూపిస్తుంది. నెటిజన్లను వర్చువల్ గా ప్రపంచంలోని పలు ప్రదేశాలను చూసే అవకాశం కల్పిస్తోంది. ఇండోనేషియాలోని సోలో సహా కొన్ని ప్రధాన నగరాల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ అందుబాటులో ఉంది. సోలోలోని ప్రధాన రహదారులు, ప్రముఖ ప్రదేశాలు అయిన సోలో బలపన్ రైల్వే స్టేషన్, క్లెవర్ మార్కెట్, నేషనల్ ప్రెస్ మాన్యుమెంట్ స్ట్రీట్ వ్యూలో కవర్ చేయబడుతున్నాయి. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇండోనేషియాలో 2014 నుంచి అందుబాటులోకి వచ్చింది.
వృద్ధ జంట పదేళ్ల జీవితం క్యాప్చర్
గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇండోనేషియా సెంట్రల్ జావాలోని సోలోకు సంబంధించి ఓ అరుదైన దృశ్యాన్ని దశాబ్దం పాటు క్యాప్చర్ చేయబడింది. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ఇందుకు కారణం ఓ వృద్ధ జంట. గూగుల్ స్ట్రీట్ వ్యూ 2014 నుంచి 2025 వరకు క్యాప్చర్ చేసిన ఫోటోల్లో సదరు వృద్ధ జంట జీవితాన్ని కళ్ల ముందు ఉంచింది. పదేళ్లలో వారి ఆనవాళ్లు కూడా లేకుండా ఎలా మాయం అయ్యాయో అందులో చూపించింది. సోలో ప్రాంతంలో కార్టో, వార్సిని అనే వృద్ధ జంట రోడ్డు పక్కనే ఓ చిన్న నీలిరంగు రేకుల షెడ్డులో కూర్చుని కనిపిస్తారు. 2015 నుంచి 2016 వరకు, ఇద్దరూ పక్క పక్కనే కూర్చొని ఉంటారు. 2018 నాటికి ఈ చిత్రాల్లో కార్టో కనిపించరు. వార్సిని మాత్రమే కనిపించింది. 2023లో కార్టో చనిపోయారు. ఆయన మరణం తర్వాత వార్సిని తన కుటుంబంతో కలిసి వోనోగిరికి వెళ్తుంది. 2024 నాటికి వారు నివసించిన రేకుల షెడ్డు మూతపడిపోతుంది. అందులో ఎవరూ ఉండరు. 2025 వరకు వచ్చే సరికి ఆ ప్రాంతంలో వారి గుడిసే లేకుండా తొలగించబడింది.
పదేళ్లలో చివరికి మిగిలింది శూన్యమే!
దశాబ్దకాలం పాటు గూగుల్ స్ట్రీట్ వ్యూ క్యాప్చర్ చేసిన ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను కదిలించింది. సాధారణ దృశ్యాలు ఓ జంటపై ప్రపంచం ఎలాంటి ప్రేమను చూపిస్తుందో చూపించాయి. కాలగమనం ఎలా ఉంటుందో అత్యంత అద్భుతంగా కళ్లముందు ఉంచే ప్రయత్నం చేసంది గూగుల్ స్ట్రీట్ వ్యూ. పదేళ్లలో కాలం ఓ జంట జీవితాన్ని ఎలా మార్చి వేసిందో చూపించింది. ఆ ఫోటోలను చూసి ప్రతి వారి హృదయంలో తెలియని ఆర్థ్రత కనిపించేలా చేస్తోంది.
Read Also: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!