బిర్యానీలో పురుగులు, బొద్దింకలు రావడం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ తింటున్న కస్టమర్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఆయన తింటున్న బిర్యానీలో ఏకంగా బల్లి కనిపించింది. వెంటనే విషయం ఓనర్ కు చెప్పడంతో.. ఆయన మాట్లాడిన మాటలు కస్టమర్ ఒళ్లు మండేలా చేశాయి. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు రెస్టారెంట్ ఓనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ అసలు ఈ ఘటన ఎక్కడ.. ఎప్పుడు.. జరిగిందంటే?
మొహ్ఫిల్ రెస్టారెంట్ బిర్యానీలో బల్లి
హైదరాబాద్ షేరిగూడకు చెందిన గుజ్జ కృష్ణారెడ్డి అనే వ్యక్తి బిర్యానీ తినాలి అనుకున్నాడు. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన.. సాగర్ రోడ్‌లోని మెహ్ఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ ఓ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత బిర్యానీ తెచ్చిపెట్టారు. సగం బిర్యానీ తినగానే ఒక్కసారిగా కృష్ణారెడ్డి షాకయ్యాడు. తాను తింటున్న బిర్యానీలో ఏకంగా బల్లి కనిపించింది. వెంటనే ఆయన వాంతి చేసుకున్నాడు. తీవ్ర ఆగ్రహంతో వెళ్లి రెస్టారెంట్ యజమానికి విషయం చెప్పాడు.
రెస్టారెంట్ యజమానికి మాటలతో తీవ్ర ఆగ్రహం
విషయం తెలిసిన వెంటనే జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పాల్సిన యజమాని.. కస్టమర్ ఒళ్లు మండేలా మాట్లాడాడు. “బల్లి బాగానే ఫ్రై అయ్యింది. మీరు తిన్నా ఏం కాదు” అని చెప్పాడు. ఆయన మాటలతో ఒక్కసారితో కోపంతో ఊగిపోయాడు కృష్ణారెడ్డి. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు.
రెస్టారెంట్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ ఘటనకు సంబంధించి రెస్టారెంట్ కు వచ్చి విచారణ జరిపిన పోలీసులు, యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా స్పాట్ కు చేరుకున్నారు. జరిగిన ఘటనపై విచారణ జరిపారు. అదే సమయంలో రెస్టారెంట్ లోని శుభ్రతా ప్రమాణాలను పరిశీలించారు. అనకున్న స్థాయిలో నీట్ నెస్ మెయింటెన్ చేయడం లేదని అధికారులు గుర్తించారు. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: చూడగానే గుండె జారిందా? ఈ బిల్డింగ్ డిజైన్ చూస్తే ఏం గుర్తొస్తోంది?
మెహ్ఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ పై స్థానికల ఫిర్యాదులు
మెహ్ఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో గతంలోనూ శుభ్రత గురించి కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. నాణ్యమైన ఆహార పదార్థాలను ఉపయోగించకపోవడంతో పాటు శుభ్రత విషయంలో తగిన ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం పరిధిలోని చాలా రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. వెంటనే ఆయా రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయాలని కోరుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటిస్తున్నారో? లేదో? గుర్తించాలంటున్నారు. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ఈ మాంసాన్ని 100 రోజులు నిల్వ ఉంచి మరీ తింటారు.. మరి కుళ్లిపోదా?