భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు జర్నీ చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, రైల్వే ప్రయాణ సమయంలో రకరకాల వ్యక్తులు ఎదురవుతుంటారు. జర్నీలో ఇబ్బందులు కలగకుండా వాళ్లు తీసుకునే జాగ్రత్తలు చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగకమానదు. చిన్న పిల్లలు ఏడ్వకుండా నిద్రపుచ్చేందుకు చీరతో ఉయ్యాలలు కట్టడం, లగేజీ ప్లేస్ లో పడుకోవడం లాంటి ఘటనలు చూశాం. కానీ, ఇప్పటి వరకు ఏ రైలులోనూ కనిపించని ఘటన ఒకటి తాజాగా కనిపించింది.
సాధారణంగా ఏసీ కోచ్ లలో ప్రయాణిస్తే ఏసీ సౌకర్యం ఉంటుంది. స్లీపర్ క్లాస్ లో వెళ్తే ఫ్యాన్లు ఉంటాయి. కానీ, ఓ వ్యక్తి ఏకంగా రైల్లో కూలర్ వేసుకుని పడుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పర్ బెర్త్ మీద చిన్న పాటి కూలర్ ఉంచి, ఛార్జింగ్ సాకెట్ లో దాని ప్లగ్ పెట్టి ఆన్ చేశాడు. షర్ట్ విప్పేసి, ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లు పడుకున్నాడు. ఈ తతంగాన్ని పక్కనే ఉన్న మరో ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: రెండు నిండు ప్రాణాలు కాపాడిన మెట్రో, ఒకేసారి గుండె, ఊపిరితిత్తుల తరలింపు!
నెట్టింట ఈ వీడియో బాగా హల్ చల్ చేయడంతో నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఈ ఆలోచన అతడికి ఎలా వచ్చింది? అని ఆలోచించడం కంటే, మీకు ఎందుకు రాలేదు? అని సిగ్గుపడండి” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “సాధారణంగా తరానికి ఓ టార్చ్ బేరర్ ఉంటాడు అంటారు. ఈ తరానికి ఇతడే టార్చ్ బేరర్” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “స్లీపర్ కోచ్ ఇప్పుడు ఏసీ కోచ్ గా మారింది. నీ ఐడియాకు ఓ దండం గురూ” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పెద్ద మొత్తంలో జరిమానా విధించాలి. అప్పుడే ఇతరులు రైల్వే నిబంధనలను ఉల్లంఘించరు” అని మరో వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. “ఇలాంటి ఘటనలు ఇండియాలోనే కనిపిస్తాయి. ఇతర ఏ దేశంలో అద్భుతాలు కనిపించవు” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు ఫన్నీగా ఆకట్టుకుంటుంది.
Read Also: వందేభారత్ స్లీపర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్, ఫస్ట్ రూట్ ఇదే!