ఆన్ లైన్ మోసాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహారణ. ముక్కు ముఖం తెలియని వ్యక్తులను నమ్మితే ఎలా మోసపోవాల్సి వస్తుందో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం. ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మోడల్ తో ప్రేమలో పడ్డాడు. నిత్యం ఆమెతో చాటింగ్ చేసే వాడు. ఫోన్ లో మాట్లాడే వాడు. చివరకు ఆమె మీద ప్రేమను పెంచుకున్నాడు. ఆమే తన భార్య అని ఊహించుకున్నాడు. చివరకు ఆమెను కలవాలని నిర్ణయించుకున్నాడు. వందల కిలో మీటర్లు కష్టపడి ప్రయాణించి ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక తనకు అసలు విషయం తెలిసింది. అడ్డంగా మోసపోయానని అర్థం అయ్యింది. జరిగిన దాన్ని తలచుకుని తన బాధను లోపలే దాచుకుని అక్కడి నుంచి బయల్దేరాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఫ్రెంచ్ మోడల్ తో బెజ్జియన్ వ్యక్తి ప్రేమాయణం
బెల్జియంకు చెందిన మిచెల్ అనే వ్యక్తికి.. ఫ్రెంచ్ మోడల్ సోఫీ వౌజెలాడ్ తో సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. చాలా కాలం పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకునే వాళ్లు. ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. నిత్యం చాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్లు. చివరకు మిచెల్ సోఫీని కలవాలి అనుకున్నాడు. బెల్జియం నుంచి కారులో బయల్దేరాడు. ఏకంగా ఆమె ఇంటికి వెళ్లేందుకు 760 కిలో మీటర్లు ప్రయాణించాడు. చివరకు ఆమె ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. ఇంట్లో నుంచి సదరు మోడల్ భర్త ఫాబియన్ బయటకు రావడంతో షాకయ్యాడు. ఒక్కసారిగా నోటమాట పడిపోయింది. గతాన్ని తరచుకుని బాధతో దు:ఖం తన్నుకు వచ్చింది. కాసేపు మౌనంగా నిలబడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత జరిగిన విషయం ఫాబియన్ కు చెప్పాడు.
సోషల్ మీడియా ద్వారా అసలు విషయం చెప్పిన సోఫీ దంపతులు
మిచెల్ చెప్పిన విషయాన్ని విని సోఫీ భర్త ఫాబియన్ చాలా బాధపడ్డాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కాసేపు తన దగ్గర కూర్చోబెట్టుకుని ఓదార్చాడు. ఈ విషయం గురించి సోఫీతో చెప్పాడు. అతడికి జరిగిన మోసం పట్ల ఇద్దరూ బాధపడ్డారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “ నా ఇంటి డోర్ బెల్ మోగించిన ఒక వ్యక్తి ‘నేను సోఫీ వౌజెలాడ్ కాబోయే భర్తని’ అని చెప్పడంతో షాకయ్యాను. అసలు భర్తను అయిన తనతోనే ఆ విషయం చెప్పడంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. ఈ విషయాన్ని సోఫీకి చెప్పాను. తను కూడా ఎంతో బాధపడింది. ఆ వ్యక్తి పట్ల నాకు చాలా జాలిగా ఉంది. నకిలీ సోషల్ మీడియా అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎవరూ బాధపడకూడదనే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నాను. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సైబర్ మోసాలకు గురికాకండి” అని సోఫీ చెప్పుకొచ్చింది.
అసలు విషయం తెలిసి మైకేల్ తానే తప్పు చేసినట్లు భావించాడు. ఎవరో ఒక మహిళ సోఫీ ఫేరుతో డర్టీ ట్రిక్ ప్లే చేసిందని సర్ది చెప్పుకున్నాడు. ఒకానొక సమయంలో సోఫీ అనుకుని సదరు యువతికి $35,000 పంపినట్లు వెల్లడించాడు. ఇప్పుడు తనకు అదంతా ఓ మోసం అని తెలిసినట్లు వెల్లడించాడు.
Read Also: ఒకే యువతిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు.. ఆ ఊరిలో ఇదే సాంప్రదాయమట!