AP News : కొన్ని పనులు చూట్టానికి సింపుల్‌గానే అనిపిస్తాయి. కానీ, వాటి వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. వేలాది మంది జీవితాలను అవి ప్రభావితం చేస్తాయి. అలాంటిదే ఆపరేషన్ కుంకీ ఏనుగులు. ఏపీ డిప్యూటీ సీఎం పట్టుబట్టి ఆ పనిని పూర్తి చేశారు. ఏపీ సరిహద్దు జిల్లాల ప్రజల ముఖచిత్రాన్ని మార్చేయబోతున్నారు. మన్యం, చిత్తూరు జిల్లాల్లో పంట పొలాలను నాశనం చేసే, రైతులను తొక్కి చంపేసే.. అడవి ఏనుగుల బెడదకు ఇక చెక్ పడినట్టే. మదమెక్కిన ఏనుగులను తరిమేసే సత్తా ఉన్న కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. బెంగళూరులో కర్నాటక సీఎం సిద్దరామయ్య నుంచి కుంకీ ఏనుగులను అధికారికంగా అందుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఈ కార్యక్రమంలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం పాల్గొన్నారు. కుంకీ ఏనుగుల రాకతో 20 ఏళ్ల సమస్య తీరినట్టేనని పవన్ కల్యాణ్ చెప్పారు. కర్నాటక, ఏపీల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
ఏపీకి ఆరు ఏనుగులు..
మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అనే ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి అందజేసింది కర్నాటక. వీటిలో నాలుగు.. కర్ణాటకలోని కొడగు జిల్లాలో గల దుబారే ఎలిఫెంట్ క్యాంప్ నుంచి రానున్నాయి. మరో రెండు.. శివమొగ్గ జిల్లాలోని సక్రెబైలు నుంచి వస్తున్నాయి. ఈ ఆరు ఏనుగులను పలమనేరులో ఉన్న ఎలిఫెంట్ హాబ్‌కు తరలిస్తారు.
కుంకీ ఎలిఫెంట్స్ ఏం చేస్తాయంటే..
జనావాసాల్లో చొరబడిన అడవి ఏనుగులను తిరిగి అడవిలోకి తరమడానికి కుంకీ ఏనుగులు సాయపడతాయి. దాడులు చేస్తున్న ఏనుగులను శాంతపరచడానికి కుంకీ ఏనుగులను ఉపయోగిస్తారు. మనుషులు, అడవి ఏనుగులకు మధ్య ఘర్షణ తలెత్తకుండా ఇవి సహాయపడతాయి. అడవి ఏనుగులు గాయపడినప్పుడు కూడా ఇవి వాటికి సాయం చేస్తుంటాయి. కుంకీ ఏనుగుల వల్ల చిత్తూరు, మన్యం, విజయనగరంలో అడవి ఏనుగుల బెడద తీరే అవకాశం ఉంది. ఏపీ అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకొస్తున్నారు.
Also Read : కోటిన్నర రివార్డు.. ఎవరీ కేశవరావు? చంద్రబాబు హత్యకు సూత్రధారి..
కుంకీ ఏనుగులకు ట్రైనింగ్
ఏపీ సరిహద్దులోని పొలాల మీద పడి దాడి చేసే ఏనుగుల్ని తరమడానికి.. కుంకీ ఏనుగులతో పరిష్కారం లభించనుంది. కుంకీ అనేది పర్షియన్ పదం కుమక్ నుంచి వచ్చింది. కుమక్ అంటే పర్షియన్‌లో సాయం అని అర్థం. బెంగాల్ నుంచి తమిళనాడు వరకూ ఈ కుంకీ ఏనుగులను వినియోగిస్తున్నారు. వీటిని చిన్నప్పటి నుంచి గస్తీ కాయటంతో పాటు రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం అందించేలా శిక్షణ అందిస్తారు.