Khairatabad Bypoll: స్వేచ్చ బ్యూరో: ఖైరతాబాద్.. ఒకప్పుడు గులాబీ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అదే స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం బీఆర్‌ఎస్‌కు సవాలుగా మారింది. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే.. అభ్యర్థి ఎంపికే బీఆర్‌ఎస్‌కు తొలి పరీక్షగా మారింది. స్థానికంగా బలమున్న నేతను బరిలో దించాలా? నగరంలో రాజకీయ పలుకుబడి ఉన్న మరో నియోజకవర్గ నేతకు అవకాశం ఇవ్వాలా? అన్న అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. టికెట్ ఎవరికి దక్కినా.. మిగిలిన ఆశావహులను సమన్వయం చేసుకుని ముందుకు సాగడమే అసలు పరీక్ష కానుంది.
ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. టికెట్ విషయంలో స్థానికత అంశం కీలకంగా మారనుంది. టికెట్ ఇచ్చిన నేత ఒక్కరే ఎన్నికను నడిపించలేరు. స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలను సమన్వయం చేయగలిగితేనే పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేస్తే గెలుపు సాధ్యమవుతుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో పార్టీకి పరిచయం ఉన్న నేతను ఎంపిక చేయాలన్న వాదన ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయ, సామాజిక పరిచయాలు ఉన్న నేతను బరిలోకి దించాలన్న ఆలోచన మరోవైపు ఉన్నట్లు సమాచారం.
ఇతర నియోజకవర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే స్థానిక ఆశావహులు, క్యాడర్ ఏ మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నగా మారుతోంది. టికెట్ ఆశిస్తున్న నేతల మధ్య పోటీ పెరిగితే.. టికెట్ దక్కని వారిని సముదాయించి ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థి వెనుక నడిపించడం అధిష్ఠానానికి మరో సవాలుగా మారనుంది. అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణాలతోపాటు స్థానిక పరిచయాలు, డివిజన్ స్థాయి క్యాడర్‌తో సమన్వయం, బూత్ నిర్వహణ వంటి అంశాలపై పార్టీ దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.
Also read: ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!
2023లో బీఆర్‌ఎస్ తరఫున దానం నాగేందర్ ఖైరతాబాద్‌లో 63,068 ఓట్లు సాధించి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 34,666, కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి 33,549 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ గణనీయమైన ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దానం కాంగ్రెస్‌లో చేరడం, ఆయన అనర్హతతో ఉపఎన్నిక రావడం, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండటం, బీజేపీ కూడా బలమైన పోటీకి సిద్ధమవుతుండటం బీఆర్‌ఎస్ ముందున్న సమీకరణాలను మార్చేశాయి. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కంటే అధిక ఓట్లు రావడం కూడా ఉపఎన్నిక లెక్కల్లో కీలకంగా మారింది. అందువల్ల 2023 అసెంబ్లీ ఫలితాలను మాత్రమే ఆధారంగా చేసుకుని వ్యూహం రచించడం సాధ్యం కాదని పలువురు గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఖైరతాబాద్‌లో ఈసారి పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యే కేంద్రీకృతం కానుంది. కాంగ్రెస్‌లో దానం నాగేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితోపాటు ఇతర నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.దీంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరన్నదే కాకుండా.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరన్నదాన్ని బట్టి కూడా గులాబీ పార్టీ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలోకి దిగితే.. ఆయన పార్టీ మారిన అంశాన్ని ప్రచారాస్త్రంగా మలచడంపైనా బీఆర్‌ఎస్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ తనకు ఉన్న పట్టును మరింత పెంచుకునేందుకు, యువతను ఆకర్షించడంపై ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి అంతసులువు ఏమీకాదని పార్టీనేతలే అభిప్రాయపడుతున్నారు.
అభ్యర్థి ఎంపికతోపాటు క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగాన్ని కదిలించడంపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. డివిజన్, బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, క్యాడర్ బలం, ఓటర్ల నమోదు తదితర అంశాలపై సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సమీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. వాటి ఫలితాలను ఎన్నికల కార్యాచరణగా మార్చడం మరో ఎత్తు. స్థానిక నాయకత్వం మధ్య సమన్వయం, టికెట్ ఆశావహులందరినీ కలుపుకొని వెళ్లడం, బూత్ స్థాయిలో కార్యకర్తలను యాక్టివ్ చేయడం కీలకం కానుంది.
ఖైరతాబాద్ ఉపఎన్నికకు మరో ప్రత్యేకత ఉంది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) తర్వాత నియోజకవర్గ ఓటర్ల సంఖ్యలో భారీ మార్పు చోటుచేసుకుంది. తాజా సవరణ ప్రక్రియలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. సెప్టెంబరు 2026 నాటి నివేదికల ప్రకారం తుది జాబితా ప్రక్రియ పూర్తయ్యేలోపు ఈ సంఖ్యలో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.దీంతో గత ఎన్నికల బూత్‌వారీ లెక్కలనే యథాతథంగా ఆధారంగా చేసుకోవడం పార్టీలకు సవాలుగా మారనుంది. కొత్త ఓటర్ల జాబితా ఆధారంగా ప్రతి పార్టీ తన బూత్ యంత్రాంగాన్ని పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది.
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఫలితానికి 2028 అసెంబ్లీ ఎన్నికల కోణంలోనూ ప్రాధాన్యం ఉంది. ఉపఎన్నికలో సాధించే ఓట్ల శాతం, డివిజన్లవారీగా వచ్చే ఆధిక్యాలు, పార్టీల మధ్య ఓట్ల బదిలీ వంటి అంశాలు భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సూచికలుగా మారవచ్చు. రాష్ట్రంలో వరుస రాజకీయ పరీక్షలు ఎదురుకానున్న నేపథ్యంలో ఖైరతాబాద్ ఫలితాన్ని మూడు ప్రధాన పార్టీలు తమ సంస్థాగత బలానికి ఒక కొలమానంగా చూడనున్నాయి.బీఆర్‌ఎస్‌కు మాత్రం ఇందులో మరో కోణం ఉంది. తమ పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి సాధించడం ద్వారా క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపాలన్నది ఆ పార్టీ ముందున్న లక్ష్యం. అందుకే అభ్యర్థి ఎంపిక నుంచి బూత్ నిర్వహణ వరకు ప్రతి అంశంపైనా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కదులుతున్నా.. డివిజన్ల వారీ సమీక్షలు ఓట్లుగా మారాలంటే బలమైన అభ్యర్థి, ఐక్యమైన స్థానిక నాయకత్వం, చురుకైన బూత్ యంత్రాంగం అవసరం. అందుకే ఖైరతాబాద్ ఉపఎన్నిక గులాబీ పార్టీకి కేవలం మరో ఎన్నిక కాకుండా.. సంస్థాగత బలాన్ని పరీక్షించే రాజకీయ సవాలుగా మారుతోంది. ఎలా ముందుకు సాగుతుంది..ఎలా విజయం సాధిస్తుందనేది చూడాలి.
Also read: 200 ఏళ్ల నాటి మిస్టరీ.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిన ‘దెయ్యాల గ్రామం’.. కుల్ధారా వెనుక రహస్యాలేంటి?