పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ బ్రహ్మాండంగా ఉంది. ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం ఇది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు పవన్. మరి ఆయన సినిమా కెరీర్ ఎలా ఉంది. సరైన హిట్ కొట్టి ఎన్నాళ్లవుతుంది. బాక్సాఫీస్ కరువు తీర్చి ఎన్నేళ్లవుతుంది..? వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతున్న హరిహర వీరమల్లు మూవీపై అభిమానులకు భారీ అంచనాలున్నా.. అది వాయిదా మీద వాయిదా పడుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ 11 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. అధికారికంగా దీన్ని ఎవరూ ధృవీకరించే ఛాన్స్ కూడా లేదు. ఇక వీరమల్లు ఓ రేంజ్ లో హిట్ అయితేనే పవన్ సినిమాలకు క్రేజ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అంచనాలు తగ్గితే మాత్రం పవన్ మార్కెట్ పై అది ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలకు రికవరీ లేక నిర్మాతలు కష్టాలు పడుతున్నారు. పవన్ నిర్మాతలంతా ఏళ్ల తరబడి ఆయా సినిమాలపై పెట్టుబడులు పెట్టి ఆల్రడీ ఇబ్బందుల్లో ఉన్నారు. వారు ఒడ్డున పడాలంటే పవన్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావాల్సిందే.
సినిమాల్లో పవన్ కల్యాణ్ చూడని ఎత్తులు లేవు, బద్దలు కొట్టని రికార్డ్స్ లేవు. కానీ ఇటీవల గేమ్ ఛేంజ్ అయింది. ఆయన రాజకీయాల వైపు రావడం, ఈలోపు టాలీవుడ్ పాన్ ఇండియా లెవల్ కి ఎదగడం.. ఇక్కడ వచ్చిన మార్పులతో పవన్ పాత సినిమాలను పోల్చి చూడలేం. అంటే టాలీవుడ్ పాన్ ఇండియా కొత్త రికార్డులు చూపించి పవన్ పాత సినిమాల్ని తక్కువ చేయలేం. పోనీ పవన్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు నిజంగానే పాన్ ఇండియా లెవల్ లో ఉన్నాయా.. అంటే అనుమానమే. హరిహర వీరమల్లు షూటింగ్ ఏళ్ల తరబడి జరిగింది. పైగా మధ్యలో దర్శకుడు కూడా మారారు. పోనీ ఇప్పుడైనా మార్కెట్ గొప్పగా జరుగుతుందా అంటే డౌటే. సినిమాకు పెట్టిన పెట్టుబడికి, ఇప్పుడు బయ్యర్లు అడుగుతున్న రేట్లకు చాలా తేడా ఉందని అంటున్నారు. పోనీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రిలీజ్ చేస్తారనుకుంటే అది కూడా ఎందుకో ఆలస్యం అవుతోంది. ఇలాంటి టైమ్ లో రికార్డులకోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ రిలీజ్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇక పవన్ కల్యాణ్ రాబోయే సినిమాలు రెండూ ఆసక్తికరంగానే ఉన్నాయి. ఓజీ సినిమాపై ఇప్పటికే ఓ స్థాయిలో బజ్ ఉంది. ఆ తర్వాత వచ్చే ఉస్తాద్ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలకు పవన్ కేటాయించిన కాల్షీట్లలో తేడాలు లేకుండా అనుకున్న టైమ్ కి షూటింగ్ లు పూర్తై విడుదలైతే పాన్ ఇండియా రికార్డుల్ని పవర్ స్టార్ ఓ చూపు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే అప్పుడు మళ్లీ టాలీవుడ్ పవన్ వెంట పడుతుంది. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా సినిమాలకోసం నిర్మాతలు క్యూ కడతారు.
పవన్ కల్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అభిమానులు చాలామందే ఉన్నారు. అయితే అభిమానులే సినిమాని హిట్ చేయలేరు. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టలేరు. తటస్థులు, ఫ్యామిలీస్ కూడా థియేటర్ల బాట పడితేనే ఇప్పుడు టికెట్లు తెగేది. నిర్మాత గల్లాపెట్ట కళకళలాడేది. శాటిలైట్ తో పాటు ఓటీటీ రైట్స్ ఇతరత్రా ప్రచార వ్యవహారాలున్నాయి కాబట్టి అదంతా నిర్మాతకు ప్లస్ అవుతుంది. ఇంత చేసినా పవన్ తో సినిమా తీశారనే పేరు మినహా ఇంకేమీ రాకపోతే మాత్రం నిర్మాత ఇబ్బంది పడాల్సిందే.
సో.. హరిహర వీరమల్లుపై చాలామంది భవిష్యత్ ఆధారపడి ఉంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. పవన్ ఇప్పుడు రాజకీయాలతో బిజీ అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఫస్ట్ ప్రయారిటీ రాజకీయాలే అని చెప్పాలి. ప్రస్తుతానికి ఆయన కొత్త సినిమాల జోలికి వెళ్లడం లేదు. మొదలు పెట్టిన సినిమాలని మాత్రమే పూర్తి చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పవన్ ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి. రాజకీయాలతోపాటే సినిమాలు కూడా అంటారా..? లేక రాజకీయాల తర్వాతే సినిమాలు అంటారా..? వెయిట్ అండ్ సీ.