Milkshake: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మన శరీరానికే కాకుండా మెదడుకు కూడా చాలా హాని చేస్తాయి. కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. ఇదిలా ఉంటే.. ‘ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ ఫిజియాలజీ’లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం మనల్ని ఆలోచింపజేసే నిజాలను వెల్లడించింది. అధిక కొవ్వుతో కూడిన మిల్క్‌షేక్ మెదడు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
మెదడుపై అధిక కొవ్వు ఆహారం ప్రభావం:
అధిక సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారం మెదడుకు రక్త ప్రసరణను దెబ్బతీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది స్ట్రోక్, మతిమరుపు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా.. మన శరీరంలో కొవ్వులు శక్తికి మూలంగా.. శరీర నిర్మాణానికి అంతే కాకుండా విటమిన్ల శోషణకు అవసరం. అయితే.. సంతృప్త కొవ్వుల అధిక వినియోగం గుండెను మాత్రమే కాకుండా మెదడును కూడా ప్రభావితం చేస్తుంది.
అధ్యయనం వివరాలు:
ఈ అధ్యయనంలో 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల 20 మంది యువకులను, 60 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల 21 మంది వృద్ధులను పరిశీలించారు. వారికి అధిక కొవ్వు ఉన్న మిల్క్‌షేక్‌ను అందించారు. ఈ మిల్క్‌షేక్‌లో దాదాపు 1,362 కేలరీలు, 130 గ్రాముల కొవ్వు ఉంది. దీనిని పరిశోధకులు ‘బ్రెయిన్ బాంబ్’ అని అభివర్ణించారు. భోజనం తర్వాత నాలుగు గంటల వ్యవధిలో వారి గుండె, మెదడుకు సంబంధించిన రక్త నాళాల పనితీరును పరిశీలించారు.
Also Read: భోజనం తర్వాత.. ఈ పనులు అస్సలు చేయొద్దు
ఈ పరిశోధనలో.. మిల్క్ షేక్ తాగిన యువకులు, వృద్ధులు ఇద్దరిలోనూ రక్త నాళాల పనితీరును ప్రభావితం చేసినట్లు కనుగొన్నారు. అయితే, వృద్ధులలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా (దాదాపు 10%) కనిపించింది. అంటే.. వృద్ధుల మెదళ్ళు ఇటువంటి ఆహార ప్రభావాలకు మరింత సున్నితంగా ఉంటాయని తేలింది. వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్, ఇతర నరాల సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.
ఒక్క మిల్క్ షేక్ కూడా ప్రమాదమే:
అప్పుడప్పుడు తీసుకునే మిల్క్ షేక్ కూడా తక్షణమే పెద్దగా హాని కలిగించకపోవచ్చు. కానీ అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. కేవలం ఒకే ఒక్క మిల్క్ షేక్ మీ శరీరంపై తక్షణ ప్రభావాన్ని చూపిస్తుంది.
ఈ అధ్యయనం గుండె ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో చెబుతుంది. కాబట్టి.. మన ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం చాలా అవసరం.